Omicron Sankranthi : ఏపీలో పోటెత్తుతున్న కరోనా.! సంక్రాంతి స్పెషల్.!

Omicron Sankranthi : సంక్రాంతి పండగ.. అంటే, తెలుగువారికి పెద్ద పండగ. అందునా, ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండగ అంటే ఆ కిక్కే వేరప్పా. ఈసారి సంక్రాంతికి ‘ఒమిక్రాన్’ కిక్కు తగిలింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒతర రాష్ట్రాల నుంచీ, ఇతర దేశాల నుంచీ స్వగ్రామాలకు సంక్రాంతి నేపథ్యంలో జనం తరలి వెళుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ అనూహ్యంగా పెరుగుతోంది.

రోజువారీ కేసులు నాలుగు వేలు దాటేశాయి. ఐదు వేలు, ఆరు వేలు.. పది వేలకు కూడా ముందు ముందు చేరుకోవచ్చు. ఈసారి 20 వేలు దాటి.. ముప్ఫయ్ వేలను కూడా టచ్ చేస్తుందా.? అన్న దిశగా అనుమానాలు పెరుగుతున్నాయి. కానీ, ఎక్కడా జనంలో కోవిడ్ ఆందోళన కనిపించడంలేదు.

సంక్రాంతి సంబరాల్లో జనం మునిగి తేలుతున్నారు. బంధువుల రాకతో గ్రామాలన్నీ కళకళ్ళాడుతున్నాయి. ఎక్కడో లోలోపల చిన్నపాటి భయం వున్నా, ఈ సంబరాల నడుమ ఒమిక్రాన్ – కరోనా ఆందోళనే కనిపించకపోవడం గమనార్హం.

ఎక్కువ మందికి కోవిడ్ సోకినా, ఈసారి లక్షణాలు పెద్దగా కనిపించకపోవడంతో, అలాంటివారి కారణంగా కోవిడ్ వ్యాప్తి మరింత అధికమవుతోది. కరోనా సోకినప్పటికీ ఆసుపత్రి చేరికలు తక్కువ వుండడం కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే, అంచనాలకు మించి రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదైతే, వైద్య ఆరోగ్య విభాగం ఆ ఒత్తిడిని తట్టుకోగలదా.? అన్నది ఆలోచించాల్సిన విషయమే.

ఏదిఏమైనా, ఈ సంక్రాంతిని ఒమిక్రాన్ సంక్రాంతిగా తెలుగు నాట.. అందునా ఆంధ్రప్రదేశ్‌లో అభివర్ణించి తీరాలేమో.