Revanth Reddy: సంక్రాంతి తర్వాతే రైతు భరోసా నిధులు విడుదల:: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా ప్రజా ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా పాలమూరు జిల్లాలో జరిగిన రైతు పండుగ విజయవంతమైన నేపథ్యంలో మంత్రులు , పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ఈయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా రైతు భరోసా గురించి ఈయన క్లారిటీ ఇచ్చారు.

రైతు భరోసా గురించి కొంతమంది మారీచుల మాటలను విశ్వసించరాదని రైతాంగానికి సూచించారు. ఇలా రైతు పండుగలో ప్రత్యక్షంగా పాల్గొన్న రైతాంగం, రాష్ట్ర వ్యాప్తంగా 568 రైతు వేదికల ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్షలాది మంది రైతులకు ఈ సందర్భంగా ఈయన అభినందనలు తెలియజేశారు. అయితే రైతులకు ఎన్నికల హామీలలో భాగంగా చెప్పిన విధంగా రైతు భరోసాను త్వరలోనే అమలు చేస్తామని మరోసారి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఎన్నికల ముందు చెప్పిన ఆరు గ్యారెంటీలలో రైతు భరోసా కూడా ఒకటి అయితే వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ తర్వాత ప్రతి ఒక్క రైతు ఖాతాలో తాము ఈ రైతు భరోసా డబ్బులను జమ చేస్తామని తెలిపారు. ఈ విషయంలో ఎవరినీ నమ్మకండి. రైతు భరోసా విధివిధానాలను ఖరారు చేయడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి , మంత్రులు తుమ్మల , పొంగులేటి నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించాము ఇక డిసెంబర్లో జరిగే శాసనసభ సమావేశాల్లో విధివిధానాలపై చర్చించి సంక్రాంతి తర్వాత రైతు భరోసా చెల్లిస్తామని హామీ ఇస్తున్నాం అన్నారు. తాము రైతు భరోసా ఎగ్గొడతాం అంటూ కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ విషయంలో ఎవరి మాటలు నమ్మకండి తప్పనిసరిగా అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా డబ్బు జమ అవుతుందని తెలిపారు.