తెలుగు ప్రజల అతి పెద్ద పండుగలలో సంక్రాంతి ఒక్కటి. ఇంటిల్లపాది ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఏడాది మొదట్లో వచ్చే ఈ పండుగ ప్రజల జీవితాలలో ఎంతో ఆనందాన్ని నింపుతూ వస్తుంది. అయితే సెలబ్రిటీలు ఈ పండుగని ఇంగ్లీష్ మయం చేయడమేంటనే కదా, మీ డౌట్! అక్కడికే వస్తున్నా. సాధారణంగా మన తెలుగు సినిమా సెలబ్రిటీలు ఏదో ఒక పండుగని టార్గెట్ చేసుకొని భారీ వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. ప్రతి సంక్రాంతికి దాదాపు నాలుగైదు సినిమాలు థియేటర్స్‌లో విడుదల కానుండగా, ఇందులో మూడు తప్పక మంచి విజయం సాధిస్తుంటాయి.
ఈసారి కరోనా వైరస్ ఉన్నా కూడా మూడు భారీ సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదల అవుతున్నాయి. వాటిలో రవితేజ, శృతి హాసన్ ప్రధాన పాత్రలలో గోపిచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ చిత్రం ఒకటి. ఈ మూవీ నేడు వెయ్యికి పైగా థియేటర్స్‌లో విడుదల అవుతుంది. ఇక జనవరి 13న తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ చిత్రం తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషలలోను విడుదల కానుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక జనవరి 14న రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ సినిమా విడుదల కానుంది. తమిళంలో మంచి విజయం సాధించిన తడమ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.
ఇక జనవరి 15న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ అనే సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా సంగతి పక్కన పెడితే క్రాక్, మాస్టర్, రెడ్ సినిమాలు మూడు కూడా ఇంగ్లీష్ టైటిల్‌తో తెరకెక్కాయి. రవితేజ క్రాక్ అంటూ రచ్చ చేసేందుకు సిద్దం కాగా, విజయ్ మాస్టర్‌గా బోధించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇస్మార్ట్ స్టార్ రామ్ రెడ్ అంటూ తన తఢాఖా చూపేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలు మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌గా రూపొందగా, ఏ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది.