పాలేరు నుంచే షర్మిల పోటీ చేస్తాననడం వెనుక అసలు కారణం ఇదే !

వచ్చే సాధారణ ఎన్నికల్లో నేను పాలేరు నుంచి పోటీ చేస్తా.. నాన్న వైఎస్‌ఆర్‌కు పులివెందుల ఎలాగో నాకు పాలేరు అలాంటిది’ అంటూ వైఎస్‌ షర్మిల క్లారిటీ ఇచ్చేశారు. పైగా ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మన ప్రభంజనాన్ని ఆపలేరు. నేను పాలేరు నుంచే బరిలోకి దిగుతానంటూ వైఎస్‌ షర్మిల మరోసారి స్పష్టంగా పేర్కొన్నారు. తనను కలసిన ఖమ్మం జిల్లా నేతలతో ఆమె ఈ విషయంపై విస్పష్టంగా తన వైఖరిని చాటిచెప్పారు. గత కొన్ని రోజులుగా ఆమె ఎక్కడినుంచి బరిలోకి దిగుతారన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి వైఎస్‌ షర్మిల మదిలో ఎలాంటి ఆలోచన ఉందో తెలీదు.

Ys sharmila sensational comments on ys jagan
Ys sharmila 

కానీ ఖమ్మం జిల్లా నుంచి వరుసగా ర్యాలీ అవుతున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మాత్రం ఆమెను ఖమ్మం జిల్లా నుంచే పోటీ చేయాలని పదేపదే కోరుతుండడంపై ఆమె కాస్త ఆలోచించుకున్న అనంతరమే స్పందించారని చెప్పొచ్చు. వాస్తవానికి వచ్చే నెల 9న ఖమ్మంలో వైఎస్‌ షర్మిల ఓ భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈ సభ నుంచే తన రాజకీయ పార్టీ స్థాపన నేపథ్యం.. పార్టీ విధి విధానాలు, జెండా, పేరు ఇలా అన్ని విషయాలపై కూలంకుషంగా నేరుగా ప్రజాక్షేత్రంలోనే ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో గత పక్షం రోజులుగా నిత్యం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వందలాది మంది ప్రజలు నేరుగా ఆమెను కలవడానికి ర్యాలీ అవుతునే ఉన్నారు. తన పట్ల, తన తండ్రి వైఎస్‌ఆర్‌ పట్ల ప్రజలు చూపుతున్న అపార అభిమానాన్ని నేరుగా ఆస్వాదిస్తున్న వైఎస్‌ షర్మిల ఇక అభిమానుల అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఏకంగా తాను ఎక్కడి నుంచి ప్రజాక్షేత్రంలోకి దూకనున్నారో తేల్చిపారేశారు. దీంతో ఖమ్మం జిల్లా.. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గ అభిమానుల్లో సంతోషం నిండిందని చెప్పొచ్చు.

వాస్తవానికి పాలేరు ఒక విలక్షణమైన గ్రామీణ నియోజకవర్గం. ఆత్మాభిమానం మెండుగా ఉండే ఈ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని మాత్రమే కాకుండా తమ పట్ల నేతలు ఉండే విధానాన్ని బట్టి స్పందిస్తుంటారని అనేకసార్లు రుజువైంది. 2009 లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన దాకా ఎస్సీ రిజర్వుడుగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌, ప్రస్తుత సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు ప్రాతినిధ్యం వహించారు. సంభాని పలు పర్యాయాలు మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం 2009లో జనరల్‌ కావడంతో రాంరెడ్డి వెంకటరెడ్ది ఇక్కడి నుంచే గెలిచి తొలిసారిగా మంత్రివర్గంలోకి అడుగుపెట్టారు. మళ్లీ 2014లోనూ రాంరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో మారిన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన తెరాస అధినేత కేసీఆర్‌కు ఖమ్మం జిల్లాలో పార్టీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత.దీనికోసం అప్పటికే ఓడిపోయి ఇంటిపట్టున ఉండి వ్యవసాయం చేసుకుంటున్న ఒకనాటి తన స్నేహితుడైన మాజీ మంత్రి తుమ్మలను ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన సీటు నుంచి ఉప ఎన్నికలో తుమ్మల బరిలోకి దించారు. రికార్డు మెజారిటీతో గెలిచిన తుమ్మల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపారు. అయితే పాలేరు నియోజకవర్గ ప్రజల ఆత్మను పట్టుకోలేకపోయిన తుమ్మల తదుపరి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. నిజానికి సాగునీరు, రహదారుల అభివృద్ధిలో తుమ్మల చేసిన సేవలను అక్కడి ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. కానీ తమతో వ్యవహరించే సమయంలో ఇవ్వాల్సినంత గౌరవ మర్యాదలు ఇవ్వలేదన్న కారణంగా తుమ్మలకు ఓటు వేయలేదని జనం వాళ్ల మాటల్లోనే చెబుతుంటారు. తుమ్మలపై గెలిచిన కందాళ ఉపేందర్‌రెడ్డి కొద్ది రోజులకే తెరాస తీర్థం పుచ్చుకోవడం విశేషం.

ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి పేద ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేసుకున్న వైఎస్‌ఆర్‌ కుమార్తెగా షర్మిలను ఒక్క సామాజికవర్గ ప్రతినిధిగానే చూడడం పరిమితి విధించినట్టే అవుతుందనీ, నిజానికి అన్ని వర్గాల నుంచి ఆమెకు విశేషమైన మద్దతు ఉందన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఎన్నికలకు కనీసం ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నా వైఎస్‌ షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తానన్న ప్రకటన రాగానే జనం నుంచి వచ్చిన స్పందన మాత్రం చెప్పుకోదగిందే. ఆమె పేర్కొన్నట్టు ప్రభంజనం ఏమేరకు ఉంటుందన్నది కాలమే నిర్ణయించాలి.