యువ ముఖ్యమంత్రి జగన్ సర్కార్ కు మరో ఝలక్ ఇచ్చేందుకు టీడీపీ సన్నద్ధమవుతోందా? అంటే అవుననే సమాచారం అందుతోంది. టీటీడీ నిరర్ధక ఆస్తులను విక్రయిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారడంతో దీన్ని ఒక అస్ర్తంగా మలుచుకుని టీడీపీ న్యాయపోరాటనాకి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను హైకోర్టు పదే పదే తప్పుబట్టడమే కాకుండా, అధికారులకు అక్షింతలు వేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఆస్తులను ఆన్ లైన్ విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేయాలనీ టీడీపీ ప్లాన్ చేస్తోంది. టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే టీడీపీ, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసే యోచనలో టీడీపీ ఉందని సమాచారం. మరోవైపు జనసేన కూడా దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన మోజార్టీ పిటీషన్లలో తీర్పులు టీడీపీకి అనుకూలంగా రావడంతో, ఇప్పుడు టీటీడీ ఆస్తుల విక్రయంపై ఎంటువంటి నిర్ణయం వెలువడుతుందోనన్న ఆసక్తి చర్చకొచ్చింది. ఇప్పటికై ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం, ఇంగ్లీష్ మీడియం, డాక్టర్ సుధాకర్ కేసు, వివేకాహత్య కేసు అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు ఇచ్చింది. మరో వైపు శాసన మండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు, అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు అంశాల్లో కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది.
ఈ నేపథ్యంలో టీటీడీ ఆస్తుల విషయంలో కూడా ప్రభత్వంపై కోర్టు కన్నెర జేసే అవకాశం లేకపోలేదన్న విశ్లేషణ వినిపిస్తోంది. మతపరమైన అంశం కావడంతో బీజేపీ కూడా టీడీపీ న్యాయ పోరాటానికి మద్దతిచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా సుజనా చౌదరి వంటి తదితర తల పండిన నాయకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో టీటీడీ ఆస్తులు అమ్మితే ఊరుకోబమని హెచ్చరించారు. ఈ అంశాలన్నింటిని టీడీపీ ఓ అస్ర్తంలో మలుచుకుని ప్రభుత్వంపై పెద్ద ఎత్తున దాడికి సమాయత్తం అవుతున్నట్లు నిపుణుల్లో చర్చకు దారి తీసింది. ఇప్పటికే డాక్టర్ సుధాకర్, రంగనాయకమ్మ లను చంద్రబాబు రెండు బాణాల్లా ప్రభుత్వం మీదకు వదిలాడని ఆరోపణలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ భూముల అమ్మకంపై టీడీపీ డైరెక్ట్ గా సీన్ లోకి ఎంటరై మరింత రచ్చ చేయడం ఖాయమనిపిస్తోంది. ఈ విషయంలో ప్రజల మద్దతు కూడా ప్రతిపక్ష పార్టీలకు పెద్ద ఎత్తున లభిస్తుందని అని భావిస్తున్నారు.