చిత్ర పరిశ్రమలోకి సహాయనటుడిగా పరిచయమై తర్వాత హీరోగా వచ్చిన ప్రతి అవకాశంలో నటుడిగా తన సత్తాని బయటపెట్టి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ‘సత్యదేవ్’. ఇమేజ్ చట్రం వైపు ప్రాకులాడకుండా విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ కొనసాగుతున్నాడు. ఈ యువ హీరో నటించిన తాజా చిత్రం ‘తిమ్మరుసు’. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వస్తూ… చివరికి ఈ నెల 30న విడుదలవుతున్నట్లు ఈ రోజు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి ‘అసైన్‌మెంట్ వాలి’ అనే డిఫరెంట్ ట్యాగ్‌లైన్ పెట్టటం ఆసక్తికరంగా ఉంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లపై మహేశ్ కోనేరు, శ్రుజన్ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కిరాక్ పార్టీ’ డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ… ”ఉమామహేశ్వర ఉగ్రరూపస్య… సినిమా తర్వాత మంచి కథ కోసం చూస్తున్న టైంలో డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి వినిపించిన ‘తిమ్మరుసు’ కథ చాలా బాగా నచ్చింది. వెంటనే నిర్మాతలు మహేశ్, సృజన్‌లతో మాట్లాడటం, మూవీ స్టార్ట్ అవ్వటం చక చకా జరిగిపోయాయి. శరణ్ కొప్పిశెట్టి చాలా సరదా మనిషి, షూటింగ్ సమయంలో అందర్నీ నవ్విస్తూ ఉండేవాడు. హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ వండర్‌ఫుల్ కోస్టార్, అప్పూ ప్రభాకర్ బ్యూటీఫుల్ విజువల్స్ అందించారు… అలానే శ్రీచరణ్ పాకాల చాలా మంచి సంగీతం అందించారు” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల, వైవా హర్ష, అంకిత్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే ఇందులో సత్యదేవ్ ఒక ఇంటెలిజెంట్ లాయర్ పాత్రలో నటిస్తూ మరోసారి ప్రేక్షకులని ఆకట్టుకోనున్నాడని తెలుస్తుంది. ఈ మూవీ మీద ఉన్న గట్టి నమ్మకంతోనే ఓటిటిలో రిలీజ్ చేయకుండా థియేటర్స్ లోనే రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు సాహసం చేస్తున్నారట. కాకపొతే కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన ఉంటుందో అనేది ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తుంది.