ఏందో ఏమో.. ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎటువైపు మళ్లుతాయో ఎవ్వరికీ అర్థం కావు. అవి అంతే. ఇప్పుడు బీజేపీ చూపు కూడా కేవలం టీడీపీ మీదనే ఉన్నది. టీడీపీని దెబ్బ తీయడానికే బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది.
ఇప్పటికే టీడీపీకి చెందిన కొందరు ముఖ్యులు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. చేరడమే కాదు.. ఇంకా టీడీపీలో ఉన్న మరికొందరు ముఖ్యులను బీజేపీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
అలా టీడీపీ ముఖ్య నేతలను తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు బాగానే శ్రమిస్తున్నారు. వాళ్లలో ఒకరు ఎంపీ సుజనా చౌదరి కాగా.. మరొకరు సీఎం రమేశ్.
వీళ్లిద్దరి వల్ల ఏపీలో టీడీపీకి క్యాడరే లేకుండా పోతున్నదనే వార్తలు కూడా వస్తున్నాయి. టీడీపీ ముఖ్యులకు గాలం వేసి.. వాళ్లకు పదవుల ఆశ చూపి బీజేపీలోకి లాగేసుకొని.. ఏపీలో టీడీపీని నామరూపం లేకుండా చేయాలనేదే వీళ్ల ప్లాన్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంతో? అబద్ధమెంత అనేది పక్కన పెడితే… టీడీపీని దెబ్బ కొట్టే ప్రయత్నమైతే బాగానే జరగుతున్నట్టుగా తెలుస్తోంది.
సుజనా చౌదరి అయితే ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలను బీజేపీ వైపు తిప్పేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. బీజేపీకి వస్తే ఎటువంటి లాభాలు ఉంటాయో.. వివరించి మరీ.. పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని మాజీ మంత్రులనే సుజనా టార్గెట్ చేశారట. వాళ్లను బీజేపీలోకి తీసుకెళ్లే విధంగా పావులు కదుపుతున్నారట సుజనా.
అలాగే.. సీఎం రమేశ్ కూడా అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ రెండు ప్రాంతాల్లోని టీడీపీ ముఖ్యలకు గాలం వేస్తున్నారట. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రులకు ఇఫ్పటికే బీజేపీ నుంచి ఆహ్వానం అందిందట. కాకపోతే కొందరు బీజేపీకి వెళ్లడానికి జంకుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఏపీలో బీజేపీ పాగా వేయడానికి బాగానే ట్రై చేస్తోంది. దానిలో భాగంగానే టీడీపీని టార్గెట్ చేసి.. టీడీపీని దెబ్బ తీయడం కోసం ఇలా నరుక్కుంటూ వస్తోంది.