తెలంగాణలో ఓవైపు దుబ్బాక ఉపఎన్నిక గురించి చర్చ నడుస్తుంటే.. మరోవైపు విజయశాంతి పార్టీ మార్పు గురించి మరో చర్చ నడుస్తోంది. ఆ పార్టీ మారుతున్నారనే వార్తలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.
నిజానికి విజయశాంతి అంటేనే ఓ ఫైర్ బ్రాండ్. ఆమె ఏ పార్టీలో ఉంటే… ఆ పార్టీకి ఎంతో బలం. అందుకే.. ఆమె పార్టీ మార్పు గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.
త్వరలోనే ఆమె కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతోందంటూ వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. దానికి మరింత బలం చేకూర్చేలా.. ఆమె బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు.
బీజేపీ పార్టీ కూడా విజయశాంతిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు సర్వం ఒడ్డుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా విజయశాంతిని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. అందుకే.. విజయశాంతి డిమాండ్లను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందట.
పార్టీ వైఖరిపై ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఒకవేళ తను పార్టీలోనే కొనసాగాలంటే… ముందు తెలంగాణ పీసీసీ చీఫ్ ను మార్చాలని విజయశాంతి డిమాండ్ చేశారట. ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ఉన్న సంగతి తెలిసిందే. తనతో పాటు.. రేవంత్ రెడ్డికి పార్టీ బాధ్యతలను అప్పగించాలని… పార్టీలో తాము ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా.. దానిపై ఎటువంటి అభ్యంతరాలు రాకూడదని.. మొత్తం మీద పార్టీ బాధ్యతనంతా తన మీద వేసుకోవడానికి విజయశాంతి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మరి.. విజయశాంతి డిమాండ్లను కాంగ్రెస్ హైకమాండ్ నెరవేర్చుతుందా? లేక.. విజయశాంతి ఈమధ్యలోనే బీజేపీలో చేరుతారా? అనేది వేచి చూడాల్సిందే.