ఈ సినిమాలో మీ కోసం చాలా ఉన్నాయి…ఈ పాట కూడా మీకోసమే: హీరో రామ్

దేవదాసు సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరో రామ్ పోతినేని. దేవదాసు సినిమా మంచి హిట్ అవటంతో హీరోగా రామ్ కి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత రామ్ నటించిన రెడీ, మస్కా, పండగ చేస్కో, ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ వంటి ఎన్నో సినిమాలు సూపర్ డుపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం రామ్ ప్రముఖ కోలీవుడ్ డైరక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ” ది వారియర్ ” అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో రామ్ కి జోడీగా అందాల భామ కృతి శెట్టి నటించింది. ఇక ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషలలో జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఈ సినిమా నుండి మరొక పాట విడుదల అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన బుల్లెట్టు పాట ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక ఇప్పుడు విజిల్ అనే మరో పాటని మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో రామ్ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. మీ అందరిని చూస్తుంటే కరోనా తరువాత ఇప్పుడే లాక్ డౌన్ తీసేసినట్లు ఉంది. ఈ సినిమా చూసి విజిల్ వేసే బాధ్యత మీది .. దాన్ని ఎండ్ చేయాల్సిన బాధ్యత నాది అంటూ ప్రేక్షకులకి చెప్పుకొచ్చాడు. ఈ పాటని డిజిటల్ రిలీజ్ చేసిన సూర్య గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రామ్ ఈ సినిమాకు సంగీతం అందించిన దేవిశ్రీ గురించి మాట్లాడుతూ..నా కెరీర్ అంతా దేవిశ్రీ గారు ఇచ్చిన బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఈ సినిమాకి మరొక మంచి ఆల్బమ్ ఇచ్చినదుకు దేవిశ్రీ కి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అంటూ రామ్ చెప్పుకొచ్చాడు. ఇక అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ… ఈ సినిమాలో మీ కోసం చాలా ఉన్నాయి. ఈ పాట కూడ ప్రత్యేకంగా మీ కోసం అడిగి మరీ పెట్టించాను ..అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతేకాకుండా థియేటర్ కి వచ్చి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి అంటూ తన అభిమానులకు చెప్పుకొచ్చాడు.