బలవన్మరణానికి పాల్పడేవారికి పెద్దగా సమస్యలు వుండాల్సిన పనిలేదు. చిన్న చిన్న విషయాలకే కొందరు బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. ఆర్థిక ఇబ్బందుల్లేనివారు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. కానీ, ఎందుకు.? రాజకీయ నాయకులు బలవన్మరణాలకు పాల్పడటం అనేది ఎప్పటికప్పుడు రాజకీయ దుమారం రేపుతుంటుంది. సినీ సెలబ్రిటీల విషయంలో అయినా అంతే. పెద్ద పెద్ద కుటుంబాలకు సంబంధించిన బలవన్మరణాలు.. మరింత చర్చనీయాంశాలవుతుంటాయ్.
స్వర్గీయ నందమూరి తారకరామారావు చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్య సమస్యలనీ, మానసిక ఒత్తిడనీ.. ఏవేవో కారణాల్ని ఎన్టీయార్ కుటుంబం చూపిస్తోంది. అయితే, అంత పెద్ద కుటుంబంలో ఆమెకు అలాంటి సమస్య వున్నప్పుడు, ఆమె ఆత్మహత్య చేసుకునేంత ఒంటరితనానికి ఎందుకు గురయ్యారు.? అన్నది ఆలోచించాల్సిన విషయమే కదా.?
చంద్రబాబుతో ఆర్థిక లావాదేవీలు, ఇతరత్రా వ్యవహారాలు.. అంటూ వైసీపీ కొత్త అనుమానాలకు తెరలేపుతోంది. రాజకీయాలన్నాక ఇలాంటి విమర్శలు, ఆరోపణలు సహజమే. తాజాగా, వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి కూడా, ఉమామహేశ్వరి మరణంపై పలు అనుమానాలు లేవనెత్తుతూ, సీబీఐ విచారణకు చంద్రబాబు డిమాండ్ చేయాలని ఉచిత సలహా ఇచ్చేశారు ట్విట్టర్ వేదికగా.
అంతే కాదు, కొన్నాళ్ళ క్రితం బలవన్మరణానికి పాల్పడిన మాజీ మంత్రి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య ఉదంతంపైనా అనుమానాల్ని వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య కేసు ఏమయ్యింది.? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.
వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీ విషయమై టీడీపీ చేసిన, చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. మరి, కోడెల విషయంలో ఎందుకు అంత యాగీ జరగలేదు.? ఇప్పుడు ఉమామహేశ్వరి బలవన్మరణంపై ఎందుకు టీడీపీ మౌనం దాల్చుతోంది.? టీడీపీ సంగతి సరే, టీడీపీ అను’కుల’ మీడియా ఎందుకు చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది.? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి వుంది.
