చెవి నొప్పితో హాస్పిటల్ కి వెళ్లి.. చేయి కోల్పోయిన మహిళ..?

కొన్ని సందర్భాలలో డాక్టర్లు నిర్లక్ష్యం, జాగ్రత్త వల్ల పేషెంట్లకు ఇవ్వవలసిన చికిత్స బదులు వేరే చికిత్స ఇవ్వటం వల్ల పేషెంట్లు ప్రమాదంలో పడిన సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఇటీవల చెవి నొప్పి ఉందని ఆసుపత్రికి వెళ్లిన మహిళ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఏకంగా తన చేయిని కోల్పోవల్సి వచ్చింది. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటు చేసుకుంది. శివహర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ అనే యువతి చెవినొప్పితో పాట్నాలోని మహావీర్‌ ఆరోగ్య సంస్థాన్‌ ఆసుపత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు జులై 11న శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ తర్వాత ఆమె ఎడమ చేతికి ఓ ఇంజక్షన్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి వెళ్లిన రేఖ చేయి రంగు మారడంతోపాటు విపరీతమైన నొప్పి ఉండడంతో మళ్లీ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించింది. వైద్యులు ఏమీ కాదని తొందరలోనే తగ్గిపోతుందని చెప్పి రేఖను పంపించేశారు.

అయితే రోజులు గడుస్తున్నా కూడా రేఖ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో ఎన్నో హాస్పిటల్స్ కి వెళ్లి డాక్టర్లను సంప్రదించింది. అయినా ఫలితం లేకపోవడంతో పాట్నాలోని మేదాంత ఆసుపత్రికి డాక్టర్ ని సంప్రదించింది. రేఖను పరీక్షించిన వైద్యులు ఆమె చేతిని తొలగించాలని లేదంటే ఆమె ప్రాణాలకు ప్రమాదం వాటిల్ల అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దీంతో రేఖ కుటుంబ సభ్యులు తప్పనిసరి పరిస్థితులలో చికిత్సకు అంగీకరించారు. దీంతో డాక్టర్లు శస్త్ర చికిత్స చేసి రేఖ ఎడమ చేతిని తొలగించారు. ఇలా చెవి నొప్పి ఉందని ఆసుపత్రిలో చేరిన మహిళ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తన చేయిని కోల్పోవల్సి వచ్చింది.

ఇందులో విషాద ఘటన ఏమనగా.. ఇటీవలే రేఖకి నిశ్చితార్థం జరిగింది. నవంబర్ లో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఇలా ఆమె చేతిని తొలగించడం వల్ల వరుడి తరపు వారు రేఖతో పెళ్లిని కూడా రద్దు చేసుకున్నారు. దీంతో వైద్యలో నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చేయి కోల్పోవలసి వచ్చిందని, వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన కూతురి జీవితం ఇలా నాశనమైపోయిందని రేఖ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ మహావీర్ ఆరోగ్య సంస్థాన్ పై చర్యలు తీసుకొని ఆస్పత్రిని మూసివేయాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.