ప్రస్థుత కాలంలో నకిలీ డాక్టర్లు రోజు రోజుకి పెరిగిపోతున్నారు.నకిలీ డాక్టర్లుగా చలామణి అవుతూ పెద్ద పెద్ద నర్సింగ్ హోమ్ లను నిర్మించి వచ్చి రాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అంతేకాకుండా అనవసరమైన టెస్టులు, మందులతో అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక ఆర్ఎంపీ డాక్టర్లూ కూడా తమకి వచ్చి రాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతు డబ్బు బాగా సంపాదిస్తున్నారు. ఇటీవల ఒక ఆర్ఎంపి డాక్టర్ చేసిన వైద్యం వల్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంఘటన కలకలం రేపింది. ఈ దారుణ ఘటన దుమ్ముగూడెం మండల పరిధిలో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే… పైడి గూడెం గ్రామానికి చెందిన కాకా గంగమ్మ, వీరస్వామి దంపతులకు రెండవ సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం చిన్నారి వయసు రెండు నెలల పదిహేను రోజులు. గత రెండు రోజులుగా చిన్న జలుబు,జ్వరంతో బాధపడుతోంది. దీంతో గంగమ్మ దంపతులు చిన్నారిని తీసుకొని చికిత్స అందించడానికి నరసాపురంలోని ఆర్ఎంపీ వైద్యుడు ఖాజా పాషా వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన ఆర్ఎంపి డాక్టర్ చిన్నారి నోట్లో రెండు చుక్కల మందు వేసి ఇతర మందులు రాసి ఇంటికి పంపించాడు.
దీంతో గంగమ్మ దంపతులు చిన్నారిని తీసుకొని ఇంటికి వెళుతుండగా మార్గం మధ్యలో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కంగారుపడిన దంపతులిద్దరూ వెంటనే అదే ఆటోలో తిరిగి డాక్టర్ వద్దకు తీసుకు వస్తున్న తరుణంలో మార్గం మధ్యలో చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతదేహం తీసుకొని డాక్టర్ ఇంటి వద్దకు చేరుకున్న బాధితులు డాక్టర్ అక్కడ కనిపించకపోవడంతో చిన్నారి మృతదేహంతో వైద్యుడు ఇంటిముందు ఆందోళన చేపట్టారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులతోపాటు ఆ ప్రాంతం ఎంపీటీసీ, సర్పంచ్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించి బాధితులను విచారిస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ చేసిన వైద్యం వల్లే తమ కూతురు మరణించిందని గంగమ్మ, వీరస్వామి దంపతులు పోలీసులకు వెల్లడించి , ఆర్.ఎం.పి డాక్టర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.