తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో ఓ ఘటన చోటు చేసుకుంది. పెళ్ళికి అంతా సిద్ధమయ్యింది. పెళ్లికూతురు తరుపున బంధువులు అందరూ కళ్యాణమండపానికి వచ్చేశారు. పెళ్లి కూతురు కూడా ముస్తాబు అయ్యి వరుడు రాక కోసం ఎదురు చూస్తోంది. ఇక ఆ వధువు తల్లిదండ్రులు కూడా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చిన వారికి మర్యాదలు చేస్తున్నారు. ఆ వధువు తల్లిదండ్రులు తమ అమ్మాయి ఒక ఇంటి బిడ్డ కాబోతోంది అన్న ఆనందంలో ఉండగానే కల్యాణ మండపంలో ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. పెళ్లి సమయం దగ్గర పడుతున్న వరుడు కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరు ఇంకా పెళ్లికి మండపానికి చేరుకోలేదు. సమస్య ఏమిటి అనేది వధువు తల్లిదండ్రులకు అర్థంకాక ఫోన్ చేశారు.
ఫోన్ చేసినప్పటికీ వరుడు వారి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి స్పందన లేదు. అసలు వాళ్ళు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏం జరిగింది అని వధువు తండ్రి ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. వరుడి కుటుంబం నుంచి వచ్చిన ఒక బంధువు అసలు విషయాన్ని బయట పెట్టేసాడు. వధువు తల్లిదండ్రులు వరుడుకి ఇస్తాను అన్న రెండు లక్షల రూపాయల కట్నం ఇచ్చిన తర్వాతే పెళ్లి జరుగుతుందని అక్కడి నుంచి వచ్చిన ఆ వ్యక్తి చెప్పాడు. దీనితో కళ్యాణ మండపంలో ఒక్కసారిగా ఆ వధువు తల్లిదండ్రులు, ఆ వధువు ఆనందం ఆవిరైపోయాయి. వరకట్నం కారణంగా చెప్పి పెళ్లి వద్దని ఆపడంతో అక్కడ విషాదం నెలకొంది.
అయితే ఆ విషయాన్ని వధువు కుటుంబ సభ్యులు అంతటితో వదిలేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలి అంటూ వధువు పోలీసులను ఆశ్రయించింది. వరకట్నం కోసం ఆశ పడుతున్న ఆ కుటుంబానికి గుణపాఠం చెప్పి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా పెళ్ళికి ముందు కల్యాణ మండపం బుకింగ్, అన్ని రకాల కార్యక్రమాలు కూడా వరుడి తరపున వారి అంగీకారంతోనే జరిగాయని బాధితురాలు తెలిపింది.ఈ ఘటనపై మహిళా పోలీసులు వరుడు కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్ కి పిలిచి దర్యాప్తు చేస్తున్నారు.