భారతీయ జనతా పార్టీ… దేశం మొత్తం తమ పార్టీ జెండా ఎగరాలని, అధికారం తమ ‘హస్త’గతం కావాలని తహతహలాడుతూ ఉంటుంది. ఉత్తరాదిలో బీజేపీ పాతుకుపోయినప్పటికీ దక్షిణాదిన ఆ పార్టీ ప్రాబల్యం ఇప్పటివరకు ఏమాత్రం లేదు. దాంతో దక్షిణాదిపై పట్టు సాధించాలని అవకాశాల కోసం కాచుకుని కూర్చుంది. కుదిరినచోట వ్యూహాలని రచిస్తూ అవకాశాలని ఏర్పరుచుకుంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉపఎన్నికల్లోనూ, స్థానిక ఎన్నికల్లోనూ రాణించడంతో బీజేపీకి తమ కల సాకారమయ్యేందుకు సమయం దగ్గర పడిందని పార్టీ నేతలు ఉత్సాహంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాణించడానికి భారీగానే అండర్ గ్రౌండ్ వర్క్ చేసినట్లుగా అర్ధమవుతుంది. ఇటీవల సంక్రాంతి పండుగ నేపథ్యంలో బిజెపి పార్టీకి చెందిన కీలక నేతలు తమిళ ప్రజలను ఆకట్టుకోవడానికి అనేక ఫీట్లు కూడా వేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఇతర పార్టీలతో కలుస్తూ.. శశికళ మరో జయలలిత కాకుండా ఎక్కడికక్కడ అణగదొక్కడం జరిగింది.
కాగా ఏఐడీఎంకే పార్టీ తో కలిసి రాజకీయాలు చేసిన బిజెపి కి జరగబోయే ఎన్నికలలో ఈ కూటమికి పెద్దగా ఓటింగ్ వచ్చే అవకాశం లేనట్లు తాజాగా ఇటీవల జరిపిన ఓ సర్వేలో ఫలితాలు బయటపడ్డాయి. వరుసగా రెండు పర్యాయాలు ఏఐడీఎంకే పార్టీ అధికారంలో ఉండటంతో.. సహజసిద్ధంగానే వ్యతిరేకత ఉండటంతో ఓటమి గ్యారెంటీ అని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. మరోపక్క ఇదే సర్వేలో ఈసారి కచ్చితంగా డీఎంకే పార్టీ గెలవడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. దీంతో తమిళనాడులో బీజేపీ వేసిన అంచనాలు విఫలమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.