వైఎస్ జగన్‌లో ఈ మార్పు వెనుక అసలు కథేంటి.?

ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలో భేటీ అయ్యారు. ఆ తర్వాత అమిత్ షా, బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం అమరావతి ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. ఇదిలా వుంటే, నిన్ననే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఆ మరుసటి రోజే, మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అసెంబ్లీలో వైఎస్ జగన్ ప్రకటించారు.

ఒకదానితో ఒకటి సంబంధం వున్న విషయాలేనా ఇవన్నీ.? ఒకదాని తర్వాత ఇంకోటి.. అన్నీ ఛెయిన్ రియాక్షన్ తరహాలో నడిచాయి గనుక, అనుమానాలు సహజంగానే వస్తాయి. అమరావతి ఉద్యమానికి బీజేపీ ఎప్పుడైతే సంపూర్ణ మద్దతు ప్రకటించిందో, ఆ తర్వాత పరిణామాలు అత్యంత వేగంగా మారాయి.

ఇక్కడ బీజేపీకి క్రెడిట్ దక్కింది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కంటతడి పెట్టారు. ఇలా వరుస ఘటనలు.. చివరికి మూడు రాజధానుల వ్యవహారం అటకెక్కింది.

అయితే, హైకోర్టులో మూడు రాజధానుల వ్యవహారంపై న్యాయమూర్తుల నుంచి ఘాటైన వ్యాఖ్యలు వినిపించాయి. అమరావతి అంటే, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిదీ.. అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. దాంతో, వైఎస్ జగన్ సర్కార్ పునరాలోచన చేయక తప్పలేదేమో.

అసలు మూడు రాజధానుల విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి ఆలోచన ఏంటో చివరి నిమిషం వరకు మంత్రులకీ తెలియదంటూ మీడియాలో ప్రచారం జరగడం గమనార్హం. అది నిజం కాకపోయి వుండొచ్చు. అత్యంత వ్యూహాత్మకంగా, అత్యంత గోప్యంగా ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారనేది అర్థమవుతోంది.

ఎవరి ప్రభావంతోనో ముఖ్యమంత్రి ఇలాంటి ఆలోచన చేశారని అనుకోగలమా.?