పదో తరగతి ప్రశ్నా పత్రం లీక్.! అసలేం జరిగింది.?

Paper Leak : నారాయణ నారాయణ.! ఇదొక్కటే కాదు, శ్రీ చైతన్య కావొచ్చు, ఇతర ప్రైవేటు విద్యా సంస్థలు కావొచ్చు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నది నిర్వివాదాంశం. ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీల్లో సరైన వసతుల్లేకపోవడంతో ప్రైవేటు విద్యా సంస్థల్ని ఆశ్రయించాల్సి వస్తోంది సామాన్యులకి.

ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం సంగతి దేవుడెరుగు.. అక్కడ జరిగే దోపిడీ అంతా ఇంతా కాదు. మరి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి.? అంటే, ప్రభుత్వాలేం చేస్తాయి.? చూస్తూ ఊరుకుంటాయ్. ప్రభుత్వంలో వున్నవారు ఆయా ప్రైవేటు విద్యా సంస్థల నుంచి లాభం పొందుతుంటారంతే. ఇదో టైపు అవినీతి. ఎవరు అధికారంలో వున్నా అంతే. ఏ రాష్ట్రంలో అయినా అంతే.

విద్యా సంస్థలను నడుపుతున్నవారు రాజకీయాల్లో భలేగా రాణించేస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో వున్నవారు, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుంటూ, రాజకీయ పార్టీలకు ఆర్థిక సహాయ సహకారాలు అందించేవారు.. అదో పెద్ద కథ.

ఏపీలో పదో తరగతి ప్రశ్నా పత్రం లీకేజీ వ్యవహారానికి వస్తే, లీకేజీ జరగలేదని సాక్షాత్తూ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారికంగా ప్రకటించారు. ఇంకోపక్క ప్రశ్నా పత్రం లీకైనట్లు కేసులు నమోదయ్యాయి. అంటే, ఇక్కడ ఏది నిజం.?

సెట్ల వారీగా ప్రశ్నా పత్రాల్ని చివరి నిమిషంలో ఖరారు చేస్తారు. అదంతా ప్రభుత్వమే చేస్తుంది. అలాంటప్పుడు లీకేజీకి ఆస్కారమెలా ఏర్పడుతుంది.? లీకులు జరుగుతాయ్.. వాటికి ప్రభుత్వంలో కీలక పదవుల్లో వున్నవారే కారకులవుతారు. వారితో విద్యా సంస్థల యాజమాన్యాలకు లింకులుంటాయ్. ఇది బహిరంగ రహస్యం.