ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఏదైనా ఆరోపణలు చేయాలంటే ప్రతిపక్షాలు ముందు పట్టుకునేదే ఆయనపై ఉన్న కేసులు. అవును… జగన్ మీద ఉన్న కేసులను పట్టుకొని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తుంటాయి. జైలుకు వెళ్లి వచ్చిన విషయాన్ని, కేసులను పట్టుకొని ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటారు. జగన్ పై పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులు ఉన్నాయని.. ప్రతిపక్షాలు ఎప్పుడూ ఆరోపణలు చేస్తుంటే.. ఆ ఆరోపణలు తప్పు అని నిరూపించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? అంటే ఎస్ అనే చెప్పుకోవాలి.
ఎందుకంటే.. జగన్ పై నమోదైన కేసుల్లో కొన్నింటినైనా మాపీ చేసేందుకు ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి కాకముందు జగన్ పై ఉన్న కేసును ఇప్పుడు ఎత్తేశారు.
అసలేం జరిగిందంటే.. కృష్ణా జిల్లా కలెక్టర్ పై అప్పట్లో జగన్ గొడవకు దిగారని.. ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటనపై అప్పుడు కలెక్టర్ పై మండిపడ్డారు జగన్. అది పబ్లిక్ గా జరగడంతో జగన్ పై క్రిమినల్ కేసు నమోదయింది. ఆ కేసు ఇప్పుడు క్లోజ్ అయిపోయింది.
అత్యంత రహస్యంగా… ఆ కేసును ఇప్పుడు ఎత్తేశారు. అప్పుడు జరిగిన ఘటనలో సీఎం జగన్ తప్పు లేదని… తామే జగన్ తప్పు ఉందని అనుకొని భ్రమపడ్డామని.. అధికారులతో రిపోర్ట్ తయారు చేయించి ఆ కేసును కొట్టేశారు. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కాబట్టి… ఆ కేసును క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అది క్రిమినల్ కేసు కావడంతో ఆ కేసును తాను అధికారంలో ఉన్నప్పుడే క్లోజ్ చేయించుకున్నారు జగన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.
అంటే.. ఇక తన పేరు మీద ఉన్న ఇతర కేసులు, సీబీఐ కేసులను కూడా ఇలాగే తను అధికారంలో ఉన్న సమయంలోనే మాఫీ చేయించుకుంటారేమో జగన్ అని రాజకీయ వేత్తలు భావిస్తున్నారు.