Bheemla Nayak : ‘భీమ్లానాయక్’: ఎందుకిలా చేశావ్ తమన్.?

Bheemla Nayak : ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేసిన మాయాజాలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘అఖండ’ సినిమాకీ తమన్ అదే స్థాయిలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. మరి, ‘భీమ్లానాయక్’ విషయంలో ఏం చేయబోతున్నాడు.?

నిజానికి, ‘భీమ్లానాయక్’ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రాణం. మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియం’ కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో టాప్ క్లాస్. అయితే, ‘భీమ్లానాయక్’ ట్రైలర్ వచ్చాక, తమన్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు షురూ అయ్యాయి.

‘పవన్ కళ్యాణ్‌కి తమన్ వెన్నుపోటుపొడిచేశాడు..’ అంటూ పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడిపోతున్నారు. కానీ, సినిమాలో తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందనేది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. ఆ వర్గాల కథనాలే నిజమైతే సరే సరి, లేదంటే మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తమన్ ఎదుర్కొనే విమర్శలు కనీ వినీ ఎరుగని స్థాయిలో వుంటాయన్నది నిర్వివాదాంశం.

అన్నట్టు, తమన్ తనను తాను పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానిగా, భక్తుడిగా చెప్పుకుంటుంటాడు. సో, తమన్ నుంచి ‘భీమ్లానాయక్’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయమై పెద్దగా అనుమానాలు అవసరం లేదు.

అయితే, ‘భీమ్లానాయక్’ ట్రైలర్ విషయంలో ఎందుకు తమన్ నిరాశపర్చాడన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్. సినిమా రిలీజ్ విషయమై గందరగోళం నెలకొనడం సహా అనేక కారణాలు ఈ సమస్యకి కారణమంటూ చర్చోపచర్చలు నడుస్తున్నాయ్.