‘టెన్త్ క్లాస్ డైరీస్’ దర్శకుడు ‘గరుడవేగ’ అంజి ఇంటర్వ్యూ ..

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకులు ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ‘గరుడవేగ’ అంజితో ఇంటర్వ్యూ…

ప్రశ్న: ‘టెన్త్ క్లాస్ డైరీస్’ ప్రశాంతంగా, ఆహ్లదకరంగా ఉంటుందా? ఇందులో క్రైమ్ & సస్పెన్స్ ఏమైనా ఉందా?
అంజి: క్రైమ్ ఏమీ లేదండీ! ఎమోషన్ ఉంటుంది. యాక్షన్, వయలెన్స్ కూడా ఎక్కువ ఉండవు. ఆ ఎమోషన్ ఏంటనేది సినిమాలో చూడాలి. మీరు అన్నట్టు… చాలా ఆహ్లాదకరంగా ఉంటుందీ సినిమా. ఎమోషన్, యాక్షన్, డ్రామా… ఎమోషన్స్ అన్నీ సినిమాలో ఉన్నాయి. మా నిర్మాత అచ్యుత రామారావు గారు, ఆయన స్నేహితుల జీవితంలో జరిగిన కథ ఇది. ఆయన కథ చెప్పాక… స్క్రీన్ ప్లే రాసి కొంచెం సినిమాటిక్ గా చేశాం.

ప్రశ్న: మీరు సినిమాటోగ్రాఫర్! దర్శకుడు కావాలని ఎప్పుడు అనుకున్నారు?
అంజి: ముందు నుంచి నాకు డైరెక్షన్ చేయాలని లేదు. ఈ ప్రొడక్షన్‌లో ఇంతకు ముందు నేను రెండు సినిమాలకు కెమెరా వర్క్ చేశా. నిర్మాతకు, నాకు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన అప్పుడప్పుడూ మా జీవితంలో ఇలా జరిగిందని చెబుతూ ఉండేవారు. మా స్నేహితుల్లో ఒక అమ్మాయి ప్రేమించిన అబ్బాయి కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయిందని చెప్పారు. ఇన్‌స్ఫైరింగ్‌గా అనిపించింది. కథ ఇన్‌స్ఫైర్ చేయడంతో డైరెక్షన్ వైపు వచ్చాను. లేదంటే సినిమాటోగ్రాఫర్ గా ఉండిపోయేవాడిని. నిన్న ఒక మలయాళం సినిమా కమిట్ అయ్యాను. ‘టెన్త్ క్లాస్ డైరీస్’ విడుదలైన వెంటనే ఆ సినిమా కెమెరా వర్క్ చేయడానికి వెళ్ళాలి.

ప్రశ్న: సినిమాటోగ్రాఫర్ డైరెక్ట్ అయితే ఎటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది?
అంజి: ఛాయాగ్రాహకుడిగా నాకు 50వ చిత్రమిది. దీనికి ముందు 49 చిత్రాల్లో 40 మంది దర్శకులతో పని చేశా. వాళ్ళ కథను నా విజువల్స్ తో చూపించిన ఎక్స్‌పీరియ‌న్స్‌ ఉండటంతో ఈ కథకు న్యాయం చేయగలని నాకు, మా నిర్మాతకు అనిపించింది. గత సినిమాల అనుభవం ఈ సినిమాకు ఉపయోగపడింది. దాసరి నారాయణ రావు, రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకుల దగ్గర పని చేశారు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నది నాకు ఈ సినిమాకు ఉపయోగపడింది.

ప్రశ్న: సినిమాటోగ్రఫీ, డైరెక్షన్… రెండూ మీరే చేయడం ఎలా అనిపించింది?
అంజి: నిర్మాత కథ చెప్పాక… దానిని అడాప్ట్ చేసుకుని కొంత వర్క్ చేశా. ఆ తర్వాత దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ నేనే చేస్తే బావుంటుందని అనిపించింది. కొంచెం కష్టపడదామని అనుకున్నా. నాకు నా టీమ్ చాలా హెల్ప్ చేసింది.

ప్రశ్న: ‘గరుడవేగ’ సినిమా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
అంజి: నా ఇంటి పేరును మార్చింది కదండీ! ఆ సినిమా ముందు వరకూ నా పేరు అంజి ఉండేది. విడుదలైన తర్వాత సినిమా పేరే నా ఇంటి పేరు అయ్యింది.

ప్రశ్న: శ్రీరామ్ ఛాయస్ ఎవరిది? ఇద్దరు ముగ్గురు సినిమాటోగ్రాఫర్స్‌ను ఆయన దర్శకులుగా పరిచయం చేశారు.
అంజి: ‘టెన్త్ క్లాస్ డైరీస్’ కథకు మిడిల్ ఏజ్డ్ పర్సన్ కావాలి. వినోదంతో పాటు ఎమోషన్ ఉంది. మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చే హీరో కావాలి. శ్రీరామ్ గారితో నాది పదేళ్ల పరిచయం. తమిళంలో ఆయన సినిమాలకు సినిమాటోగ్రఫీ చేశా. ఆయన అంటే ఏంటో నాకు తెలుసు కాబట్టి ఇందులో హీరో పాత్రకు పర్ఫెక్ట్ అనిపించింది. ఆయనకు కథ చెప్పా. నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు.

ప్రశ్న: అవికా గోర్ ఎంపిక ఎవరిది?
అంజి: సినిమా చూస్తున్నప్పుడు హీరోయిన్ మన ఇంట్లో అమ్మాయిలా అనిపించాలి. అవికా గోర్ నార్త్ ఇండియన్ అయినప్పటికీ ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా ఏపీ, తెలంగాణలో అందరికి ఆ అమ్మాయి తెలుసు. మా ఫస్ట్ ఛాయస్ ఆ అమ్మాయే. వినగానే ఓకే చేసింది. అవికా గోర్, శ్రీరామ్ మాత్రమే… కథ అనుకున్నాక ప్రతి పాత్రకు ఎవరిని అనుకున్నామో, వాళ్ళు ఓకే అయ్యారు. కథ కనెక్ట్ కావడంతో ఎవరూ నో చెప్పలేదు.

ప్రశ్న: దర్శకుడిగా ఇంకో సినిమా చేస్తున్నట్టు ఉన్నారు!
అంజి: అవునండీ! ప్రముఖ దర్శకులు జి. నాగేశ్వర రెడ్డి గారు కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ప్రొడక్షన్ చేశారు. ఆ సినిమా టైటిల్ ‘బుజ్జి ఇలా రా’. త్వరలో విడుదలకు రెడీ చేస్తున్నాం. ‘టెన్త్ క్లాస్ డైరీస్’ తర్వాత ఆ సినిమా స్టార్ట్ చేశా. కరోనా వల్ల ఈ సినిమా విడుదల కొంత ఆలస్యం అయ్యింది. ఈలోపు ‘బుజ్జి ఇలా రా’ కూడా రెడీ అయ్యింది.

ప్రశ్న: దర్శకుడిగా కంటిన్యూ అవుతారా? సినిమాటోగ్రఫీ చేస్తారా?
అంజి: మంచి కథ వస్తే.. ఇన్‌స్ఫైర్‌ చేస్తే… డైరెక్షన్ చేస్తాను. దర్శకుడిగా మూడో సినిమాకు రీమేక్ అనుకుంటున్నా. లేదంటే సినిమాటోగ్రఫీ చేస్తా. ముందు చెప్పినట్టు… మలయాళ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నా.

ప్రశ్న: మీ ‘టెన్త్ క్లాస్ డైరీస్’లో ఎన్ని పేజీలు ఈ సినిమాలో చూపించారు?
అంజి: నాకు టెన్త్ క్లాస్ మెమరీస్ పెద్దగా లేవు. పదో తరగతి ఫినిష్ అయ్యే సమయానికి… పదేళ్లకు ఇండస్ట్రీకి వచ్చేశా. నా జీవితంలో సన్నివేశాలు ఏవీ పెట్టలేదు. కానీ, షూటింగ్ చేస్తున్నప్పుడు క్లాస్ రూమ్ జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి.