రాయలసీమ జిలాల్లోని నియోజకవర్గాల్లో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా ఇక్కడ అదిపత్యం కోసం పోరాటం సాగుతూనే ఉంది. నియోజకవర్గాన్ని కంచుకోటగా చేసుకుని జిల్లా రాజకీయాలను శాసించిన కుటుంబం భూమా కుటుంబం. భూమా నాగిరెడ్డి అలాగే ఆయన సతీమణి శోభా నాగిరెడ్డిలు చాలా కాలం ఆళ్లగడ్డని తమ గుప్పిట్లో ఉంచుకున్నారు. ఏ పార్టీలో ఉన్నా గెలుపు గుర్రం ఎక్కగలిగేవాళ్ళు. టీడీపీ, ప్రజారాజ్యం, వైసీపీ ఇలా ఏ పార్టీలో ఉన్నా వారిదే హవా. అలాగే నంద్యాలలో కూడ భూమా కుటుంబానికి మంచి పట్టుంది.
దాదాపు దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీతో తలపడి సత్తా నిరూపించుకోవాలని భూమా కుటుంబం ట్రై చేసింది. వైసీపీ ఆతరవాత టీడీపీలో వీరి రాజకీయం సాగింది. మొదటి నుండి వీరికి ప్రధాన ప్రత్యర్థి వర్గం శిల్పా కుటుంబం. ఈ రెండు కుటుంబాల్లో మొదటి తరం పోయి రెండవ తరం వారసులు రాజకీయాల్లో ఉన్నారు. అయినా వారి కుటుంబాల నడుమ అదే ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం భూమా ఫ్యామిలీ టీడీపీలో ఉండగా శిల్పా కుటుంబం వైసీపీలో ఉంది. ఇటీవలే వైసీపీ నేత సుబ్బారాయుడును కొందరు దారుణంగా కొట్టి చంపారు. చంపింది భూమా కుటుంబానికి సన్నిహితమైన వ్యక్తేనని, హత్యలో భూమా ఫ్యామిలీ హస్తం ఉందని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర ఆరోపించారు.
దీనికి భూమా అఖిల ప్రియా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అనవసరంగా తమ మీద హత్యానేరం మోపుతున్నారని మండిపడిన ఆమె ఎమ్మెల్యే రవిచంద్ర హత్యలో తమ ప్రమేయం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటామని అలాగని నిందలు వేస్తూ ఉంటే చూస్తూ కూర్చోమని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. శిల్పా రవిచంద్ర సైతం చర్యకు ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. ఇలా బద్ద శత్రువులైన రెండు కుటుంబాలు మళ్ళీ కత్తుల్లాంటి మాటలు దూసుకుంటుండటంతో నంద్యాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువైపులా ఉన్నది యువనాయకులు కావడంతో ఇరు కేడర్లు ఎప్పుడు తలపడతాయోనని ప్రజలు, పోలీసుల్లో కంగారు నెలకొంది.