ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుందనే టాక్ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ చేరబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. గంటా ఎంట్రీకి వైసీపీ అధినేత సీయం జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీంతో ఆగస్టు 15న గంటా శ్రీను వైసీపీలో అఫిషియల్‌గా చేరనున్నారని టీడీపీ అనుకూల మీడియాతో పాటు టీడీపీ తమ్ముళ్ళు కూడా చెబుతున్నారు.
అయితే ఇప్పుడు టీడీపీకి మరో భారీ షాక్ తగనుండి సమాచారం. విశాఖకు చెందన మరో ఎమ్మెల్యే గణబాబు కూడా గంటా శ్రీనివాసరావు బాలలోనే వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుండి విజయం సాధించిన గణబాబు, ఇటీవల జగన్ సర్కార్ పై ప్రశంసలు కురిపించారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం వాయవేగంతో స్పందించి, జిల్లా యంత్రాగాన్ని అప్రమత్తం చేసిందని, దీంతో విశాఖకు పెనుప్రమాదం తప్పిందని, అలాగే విశాఖ బాదితుల పట్ల జగన్ సర్కార్ చూపించిన చొరవ భేష్ అని కొనియాడారు.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. తెలుగుదేశం పార్టీ అంటే నిత్యం వైసీపీని విమర్శించే పార్టీగానే రాష్ట్ర ప్రజలు భావిస్తారు. ఈ రెండు పార్టీల మధ్య బద్ధ విరోదం ఉందనేది అందరికీ తెలిసిన సత్యం. జగన్ పేరెత్తితేనే నిప్పులు చెరుగుతారు. ముఖ్యంగా చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు, వైసీపీ పై విమర్శలు చేసేందుకు పోటీ పడతారు. అయితే టీడీపీ తమ్ముళ్ళకు భిన్నంగా ఎమ్మెల్యే గణబాబు జగన్ సర్కార్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది.
ఇక ఈ క్రమంలో గతంలోనే ఆయన పార్టీ మారనున్నారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు గణబాబు టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వెళుతుండడంతో, గణబాబును కూడా వైసీపీలోకి తీసుకెళుతున్నారని టీడీపీ వర్గాల నుండి ఓ టాక్ బయటకు వచ్చింది. మరి ఇదే నిజమైతే ఒకేసారి విశాఖ నుండి ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీని వీడితే, ఉత్తరాంధ్రలో చంద్రబాబు అండ్ పార్టీకి ఊహించని దెబ్బే అని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే, రాష్ట్రంలో టీడీపీ మొత్తం ఖాళీ అవడం ఖాయమని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.