కరోనా మొదటి వేవ్ తర్వాత అత్యంత వేగంగా కోలుకున్నది తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే. 2021 సంక్రాంతి రిలీజులతో ఇటు థియేటర్లు, అటు సినిమా పరిశ్రమ, మరోపక్క ప్రేక్షక లోకం ఊపిరి పీల్చుకుంది. దురదృష్టవశాత్తూ సెకెండ్ వేవ్ వచ్చిపడిందిగానీ, లేదంటే బాక్సాఫీస్ హంగామా ఇంకోలా వుండేది. ఎలాగైతేనేం, రెండో వేవ్ భయాలు కాస్త తగ్గి, మళ్ళీ థియేటర్లు తెరచుకున్నాయి. తొలుత చిన్న సినిమాలే విడుదలయ్యాయ్. కానీ, ఇప్పుడు పెద్ద సినిమాలకు లైన్ క్లియర్ అవుతోంది. ఓటీటీ మాట ఎక్కడా వినిపించడంలేదు. 2022 సంక్రాంతికి పెద్ద సినిమాలు… చాలా పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. వాటి రిలీజ్ డేట్స్ కూడా వచ్చేయడంతో సినీ పరిశ్రమలో అప్పుడే సంక్రాంతి పండగ వచ్చేసిందా.? అన్నంత ఆనందం కనిపిస్తోంది.
ఆయా సినిమాలకు సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేసి, ప్రమోషన్లు కూడా షురూ చెయ్యాల్సిన బిజీలో ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్లు బిజీగా వున్నారు. అయితే, కరోనా అనుభవాల నేపథ్యంలో.. పరిశ్రమ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని ఆయా సినిమాల హీరోలు, దర్శక నిర్మాతలు మరింత సఖ్యతగా ఆయా సినిమాల రిలీజుల్ని ప్లాన్ చేసుకుంటే మంచిది.. ప్లాన్ చేసుకున్నాకనే రిలీజ్ డేట్స్ వస్తున్నాయని కూడా అనుకోవచ్చనుకోండి.. అది వేరే సంగతి. ‘మా సినిమా చూడండి.. వాళ్ళ సినిమాని కూడా ఆశీర్వదించండి..’ అనే స్థాయిలో అన్ని సినిమాల ప్రమోషన్లూ వుండాల్సిన సమయమిది. అయితే, కరోనా మూడో వేవ్ భయాలు ఇంకా తొలగిపోలేదు. ఇప్పటికే వచ్చేసిందనీ.. రాబోతోందనీ.. పీక్ స్టేజ్ విపరీతంగా వుండబోతోందనీ.. పలు అధ్యయనాలు చెబుతున్న దరిమిలా, పరిశ్రమ పెద్దలు తాజా పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇంకో రెండు మూడు నెలల్లో కరోనా భయాలన్నీ తొలగిపోవాలని ఆశిద్దాం.