విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నఉద్యమానికి తెలంగాణ సమాజం పూర్తి మద్దతిస్తుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. ‘అవసరమైతే కేటీఆర్ అనుమతితో విశాఖ వెళ్ళి, ప్రత్యక్షంగా విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తాం..’ అని కేటీఆర్ వెల్లడించడం గమనార్హం. ‘ఈ రోజు విశాఖ ఉక్కుని అమ్మేస్తున్నారు. పొరుగు రాష్ట్రంలోని సమస్యే కదా అనుకుంటే కుదరదు. రేప్పొద్దున్న తెలంగాణలోని బీహెచ్ఈఎల్‌ని కూడా అమ్మేస్తామంటారు.. ఆ తర్వాత సింగరేణి మీద పడతారు. ఈ ప్రైవేటీకరణల్ని వ్యతిరేకించాలి..’ అని కేటీఆర్ నినదించారు. ‘ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు.? దీన్ని కూడా ప్రైవేటీకరణ చేసేద్దాం..’ అనే ఆలోచనలు కూడా కేంద్ర పాలకులకు రావొచ్చని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అయితే, కేటీఆర్ స్థాయిలో ఆంధ్రపదేశ్‌కి చెందిన ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కూడా ఇప్పటిదాకా కేంద్రాన్ని నిలదీయలేకపోవడం కాస్త ఆశ్చర్యం గొలిపే అంశమే.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్రానికి లేఖలు రాస్తున్నారు.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంగతి సరే సరి. ఇటు టీడీపీ, అటు వైసీపీ.. రెండూ పరస్పర విమర్శలకే ప్రాధాన్యతనిస్తున్నాయి. పైగా, ఈ రెండు పార్టీలూ మునిసిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసమే ఉద్యమాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది అక్కడి పరిస్థితి. మరోపక్క, ప్రశ్నిస్తానంటూ రాజకీయ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఢిల్లీకి వెళ్ళి.. కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి లేఖ ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల నుంచే కొంచెం గట్టిగా స్వరం వినిపిస్తోంది ప్రధాని నరేంద్ర మోడీపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు సంబంధించి. కాగా, ‘తెలంగాణకూ ఆంధ్రపదేశ్ నుంచి సహకారం అందాలి.. పరస్పరం సహకరించుకుని, కేంద్రానికి వ్యతిరేకంగా నిలబడాలి..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించడం మరో ఆసక్తకిరమైన అంశం.