తెలంగాణ రాజకీయాల్లో భూకంపం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో షాకింగ్ ట్విస్ట్..!

తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు మరింత పెంచింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు ఒక చిన్న పెన్‌డ్రైవ్‌నే కీలకంగా మారింది. ఆ పెన్‌డ్రైవ్‌లో ఏముందన్న ప్రశ్న రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తొమ్మిది మంది ఉన్నతాధికారులతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ బృందం విచారణను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన సిట్, ఇప్పుడు ఈ కేసులో అసలు ‘గేమ్ ఛేంజర్’గా మారిన పెన్‌డ్రైవ్‌పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది.

సిట్ వర్గాల సమాచారం ప్రకారం, ఆ పెన్‌డ్రైవ్‌లో వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లు నమోదై ఉన్నట్లు గుర్తించారు. ఇవి సాధారణ నెంబర్లు కాకుండా, కీలక వ్యక్తులకు సంబంధించినవిగా అధికారులు భావిస్తున్నారు. ఈ డేటానే ఆధారంగా తీసుకొని ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభాకర్ రావు విధుల్లో ఉన్న సమయంలోనే ఈ పెన్‌డ్రైవ్‌లో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కీలక సమాచారం భద్రపరచినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో రాజకీయ నాయకులు, ప్రముఖ జర్నలిస్టులతో పాటు న్యాయవ్యవస్థకు సంబంధించిన ఓ కీలక వ్యక్తి ప్రొఫైల్ వివరాలు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. దీంతో కేసు తీవ్రత మరింత పెరిగింది.

అన్ని డిజిటల్ ఆధారాలను పూర్తిగా ధ్వంసం చేశామనే భావనలో నిందితులు ఉన్నప్పటికీ, ఈ పెన్‌డ్రైవ్ మాత్రం సిట్ చేతికి చిక్కడం కేసులో కీలక మలుపుగా మారింది. ఇదే ఈ కేసును కోర్టులో నిలబెట్టే ‘సాలిడ్ ఎవిడెన్స్’గా మారుతుందని సిట్ అధికారులు విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాకర్ రావును ఎదురుగా కూర్చోబెట్టి, పెన్‌డ్రైవ్‌లోని ప్రతి అంశాన్ని చూపిస్తూ సిట్ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. డేటా ఎలా సేకరించారు, ఎవరి ఆదేశాల మేరకు ట్యాపింగ్ జరిగింది, ఆ సమాచారం ఎవరికి చేరింది అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

ఎల్లుండి వరకు ఈ పెన్‌డ్రైవ్‌కు సంబంధించిన పూర్తి నిజాలు వెలికి తీయడమే లక్ష్యంగా సిట్ దర్యాప్తు కొనసాగనుంది. ఒక్క పెన్‌డ్రైవ్ తెలంగాణ రాజకీయాల్లో ఎంత పెద్ద తుఫాన్ రేపుతుందో అనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలో నెలకొంది.