రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పటినుంచో వేచిచూస్తున్న అర్హుల కోసం.. తెలంగాణ ప్రభుత్వం చివరికి తీపికబురు అందించింది. చాలా కాలంగా కొత్త కార్డుల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతూనే ఉండగా.. ఈసారి ఏకంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తిలో రాబోయే 14న ఈ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు.
ఇప్పటికే ప్రభుత్వం అర్హుల జాబితాను సిద్ధం చేసి, క్లీన్ చేయగా.. మొత్తం 2 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఈ సారి కొత్త కార్డులు పొందనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటయ్యి, కొత్త కార్డుల జారీకి మార్గదర్శకాలను రూపొందించింది. మీ సేవా కేంద్రాలు, ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అధికారులు తుది జాబితాను ఖరారు చేశారు.
ఇక ఈ సారి రేషన్ కార్డులు స్మార్ట్ గా, టెక్నాలజీతో అందించబోతున్నారు. చిన్న సైజులో, ఏటీఎం కార్డులా ఉండే ఈ స్మార్ట్ కార్డులో బార్ కోడ్, ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫోటో, ప్రభుత్వ లోగో స్పష్టంగా ఉంటాయి. ఇలా ఆధునిక రూపకల్పనతో జారీ అయ్యే కొత్త కార్డులు ప్రజలకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు కొత్త రేషన్ కార్డులు అందించబోతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఈ సారి మరింత సులభంగా, పారదర్శకంగా సేవలందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే నమూనాను తుది దశకు తీసుకువెళ్లగా, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.