తెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకుడిగా పేరున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల సీజనల్ వ్యాధులు తీవ్రంగా ప్రబలుతుండగా.. కేసీఆర్‌కి జ్వరంతో ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు అతనిని గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌కి తరలించారు. తాజా సమాచారం ప్రకారం, ప్రత్యేక వైద్య బృందం కేసీఆర్‌ను పరిశీలిస్తోంది. జ్వరంతో పాటు ఇతర సాధారణ వైద్య పరీక్షలు, రక్తపరీక్షలు, స్కానింగ్‌లు కూడా చేసినట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. క్షణక్షణం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి పార్టీ నేతలు తెలుసుకుంటున్నారు.
కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారనే వార్త తెలిసిన వెంటనే.. బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. చాలా మంది అభిమానులు, కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. తన ఆరోగ్యం పరంగా పూర్తి సమాచారం త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.
తాజాగా తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతుండగా, కేసీఆర్ అనారోగ్యం పార్టీలో ఆందోళనను రేపింది. త్వరితగతిన ఆయన కోలుకుని తిరిగి కార్యకలాపాల్లో పాల్గొంటారని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.