ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటర్ల మాయాజాలం.!

తేలిగ్గా గెలిచే చోట.. లేనిపోని డాంబీకాలకు పోయి, అప్రతిష్ట మూటగట్టుకోవడమెందుకు.? అది తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కావొచ్చు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావొచ్చు.. వైసీపీలో ఏదో జరుగుతోంది. అది వైసీపీని ముంచేసే కార్యక్రమం తప్ప, వైసీపీకి పనికొచ్చే విషయం కాదు.! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో కొందరు ఓటర్లు మీడియా ముందు అడ్డంగా దొరికిపోయారు. వార్డుకి ముగ్గుర్ని చొప్పున ఎంపిక చేసి తీసుకొచ్చారంటూ కొందరు మహిళలు అసలు విషయం ఒప్పేసుకున్నారు. అసలు తామెందుకు ఓట్లు వేస్తున్నదీ తమకే తెలియని పరిస్థితి.

ఒకరేమో ఏడో తరగతి ఫెయిల్, ఇంకొకరు ఎనిమిదో తరగతి. మరొకరు పదో తరగతి. ఇదీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేస్తున్న ఓటర్ల తీరు. డిగ్రీ పట్టా చేతిలో వున్నవారికి మాత్రమే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసేందుకు అవకాశం వుంది. కానీ, ఇక్కడ చిత్రంగా.. ఏడో తరగతి ఫెయిలయినవారు కూడా ఓట్లేసేస్తున్నారు.

అధికారులు ఇలాంటోళ్ళని నిలువరించే పరిస్థితి లేదు. ఎందుకంటే, వారి దగ్గర ఓటరు స్లిప్పులు వున్నాయ్. ఎందుకీ దుస్థితి.? అధికార పార్టీ తరఫున వీళ్ళంతా ఓట్లేయడానికి వచ్చారు. ఆ విషయం వాళ్ళ మాటల్ని బట్టే అర్థమవుతోంది. స్థానిక నాయకత్వం అత్యుత్సాహమా.? అధికార యంత్రాంగం కూడా అధికార పార్టీ మెప్పు కోసం పాకులాడుతోందా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణాల్ని ప్రపంచానికి చూపిస్తున్నాయ్.