Nandamuri Balakrishna: ఎన్టీఆర్ జాతీయ అవార్డుపై స్పందించిన బాలయ్య బాబు.. ఆయన రియాక్షన్ ఇదే!

Nandamuri Balakrishna: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు గద్దర్ అవార్డులు. సోషల్ మీడియాలో కూడా ఇదే పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులపై తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గద్దర్ అవార్డు రావడం పట్ల ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే చాలామంది ఈ విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు కూడా చేశారు.

ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన గ‌ద్ద‌ర్ అవార్డుల‌పై స్పందించారు. త‌న‌కు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్ర‌క‌టించ‌డాన్ని అదృష్టంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు. ఇది దైవ నిర్ణ‌యంగా, త‌న తండ్రి ఎన్టీఆర్ ఆశీర్వాదంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఈ విషయంపై స్పందిస్తూ.. ఎన్టీఆర్ శ‌తజ‌యంతి ఉత్స‌వాలు పూర్తి చేసుకున్న అద్భుత‌మైన ఘ‌డియ‌లు ఒక వైపు, ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 సంవత్సరాల అమృత ఉత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు, నటుడిగా నేను 50 ఏళ్ళ స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకొక వైపు, కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ భూషణ్ తో సత్కరించిన ఇలాంటి త‌రుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి ఎన్టీఆర్ జాతీయ అవార్డుని నాకు ప్ర‌క‌టించ‌డం నా అదృష్టంగా, దైవ నిర్ణ‌యంగా, నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను.

ఇంత‌టి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పుర‌స్కారానికి న‌న్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్ర‌భుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జ్యూరీ స‌భ్యుల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు తెలియజేస్తున్నాను. ప్ర‌పంచం న‌లుమూల‌లా ఉన్న తెలుగు ప్ర‌జ‌ల దీవెన‌లు, నాన్న గారి చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్ల‌వేళలా ఇలానే ఉండాల‌ని కోరుకుంటున్నాను అని నంద‌మూరి బాల‌కృష్ణ చెప్పుకొచ్చారు. అయితే బాలయ్య బాబుకు అవార్డు రావడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ జై బాలయ్య అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నందమూరి బాలకృష్ణకు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.