Telangana: జనసేనకు జన్మ, నాకు పునర్జన్మ నిచ్చిన నేల… తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ పవన్ ట్వీట్!

Telangana: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఆవిర్భావ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేత కేసిఆర్ కేటీఆర్ కవిత వంటి వారందరూ కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి ప్రధానమంత్రి నుంచి మొదలుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఇకపోతే జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని సోషల్ మీడియా వేదికగా ఈయన చేసిన పోస్టు వైరల్ అవుతుంది. తెలంగాణ జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల..నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల… నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాలలో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ తెలిపారు.

ఇలా తెలంగాణ తనకు పునర్జన్మ నిచ్చిన నేల అంటూ పవన్ కళ్యాణ్ పలు సందర్భాలలో మాట్లాడుతూ ఉంటారు.గతంలో ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రచారం చేస్తున్న సమయం లో 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి పవన్ స్పృహలోకి రాలేదు. ఆ తర్వాత కొంతసేపటికి స్పృహ లోకి వచ్చారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సుల వల్ల తాను ఈ ప్రమాదం నుంచి బయటపడ్డానని, అందుకే నాకు తెలంగాణ పునర్జన్మని ఇచ్చిన నేల అంటూ పలు సందర్భాలలో పవన్ ప్రస్తావిస్తూ ఉంటారు.