తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతన్నలకు గుడ్ న్యూస్ చెప్పారు. వరుసగా ఎన్నికలు రావడంతో పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న రైతు బంధు పైసలు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తున్నారు. ఈనేపథ్యంలో రైతన్నలకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. రైతుల ఖాతాల్లోకి త్వరలోనే రైతుబంధు పైసలు జమకానున్నట్టు స్పష్టం చేశారు.
దీనికి సంబంధించిన నిధుల విడుదల కోసం ఆర్థిక శాఖకు ఫైల్ ను పంపించారు. రైతు బంధు డబ్బులు డిసెంబర్ 27 నుంచి రైతుల ఖాతాల్లో బదిలీ అవుతాయి. జనవరి 7, 2021 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని సీఎం తెలిపారు.
రైతుబంధు గురించే సీఎం కేసీఆర్ ఇవాళ అంటే సోమవారం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు రైతు బంధు పైసలు చేరాలని సీఎం స్పష్టం చేశారు. ఈసారి రైతు బంధు కోసం ప్రభుత్వం 7300 కోట్ల రూపాయలను విడుదల చేయనుంది.
ముందుగా తక్కువ వ్యవసాయ భూమి కలిగిన రైతులకు డబ్బులు జమ అవుతాయి. ఆ తర్వాత ఎక్కువ భూమి కలిగిన వాళ్లకు డబ్బులు జమ అవుతాయి. ఇది యాసంగి సీజన్ లో రెండో విడుతలో భాగంగా వేస్తున్న రైతు బంధు సాయం.