తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య యాభైవేల మార్క్‌కు చేరుకుంది. ప్రతిరోజు వెయ్యికి పైగా తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక తాజా లెక్కలు చూస్తే.. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 9 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,826కు చేరుకుందని, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా సోకి 447 మంది మృతి చెందగా, 39,327 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 11,052 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో హైదరాబాద్‌లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన ఒక్కరోజులోనే జీహెచ్ఎంసీ పరిధిలో 662 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ప్రతిరోజు ఐదు వందలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
ఇక షాకింగ్ మ్యాటర్ ఏంటంటే తెలంగాణలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెళ్ళడించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నాలుగైదు వారాలు చాలా క్లిష్టమైనవని, దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ, ద్వితీయ శ్రేణి నగరాల్లో కేసులు పెరుగుతున్నాయని శ్రీనివాసరావు అన్నారు.
దీంతో ప్రజలు తప్పకుండా స్వీయనియంత్రణను పాటించాలని శ్రీనివాసరావు సూచించారు. ఇక తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా, ప్రస్తుత పరిస్థితి ఉందని, ఈ క్రమంలో వైద్య సిబ్బంది కూడా చాలా ఒత్తిడిలో ఉన్నారని.. దీంతో కరోనా లక్షణాలు ఉంటేనే టెస్టులు చేయించుకోవాలని, ఎందుకంటే కొందరు ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా టెస్టులు చేయించుకుంటున్నారని, దీంతో అవసరం ఉన్న కరోనా పేషెంట్లు నష్టపోతున్నారని, కరోనా పేషెంట్లకు తక్షణమే చికిత్సనందిస్తేనే మంచిదని శ్రీనివాసరావు తెలిపారు.
అయితే హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యల పై మంత్రి ఈటల రాజుందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విషయంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని అలాంటిది ఒక్క తెలంగాణలోనే కరోనా వైరస్ కమ్యూనిటీ దశకు చేరుకుందని, హెల్త్ డైరెక్టర్ అండ్ ఇతర అధికారులు ఎలా ప్రకటిస్తారని మంత్రి ఈటల మండి పడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, తెలంగాణలో కరోనా తీవ్రత తక్కువగానే ఉందని, రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.