తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్ని రద్దు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షల్ని ఇటీవల రద్దు చేసిన విషయం విదితమే. కరోనా నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు మానసికంగా సిద్ధంగా లేరు. దానికి తోడు, కరోనా సెకెండ్ వేవ్ ఇంకా కొనసాగుతుండగా, మూడో వేవ్ భయాలు వెంటాడుతున్నాయి.
ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ అంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటమే. కాగా, పదో తరగతి అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో ప్రస్తుతానికి వైఎస్ జగన్ సర్కార్ వాయిదా మంత్రాన్నే జపిస్తోంది. దాంతో విద్యార్థుల్లో తీవ్ర ఒత్తిడి కనిపిస్తోంది. పరీక్షలు వద్దంటూ విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా తమ వాదన వినిపిస్తున్నారు. అయితే, విద్యార్థుల ప్రాణాల్ని పణంగా పెట్టే నిర్ణయం తీసుకోబోమనీ, పరిస్థితులు అనుకూలించాక పరీక్షలు నిర్వహిస్తామనీ ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
పరీక్షల నిర్వహణ అన్నది మంచి నిర్ణయమేగానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అదెంత సమంజసం.? అన్నది కాస్త ఆలోచించుకోవాలి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ప్రభుత్వ తీరు పట్ల వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా కరోనా కారణంగా కుదేలైన కుటుంబాలు ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. దేశంలో పలు రాష్ట్రాలు పరీక్షల రద్దు కోసం నిర్ణయం తీసుకుంటుండడంతో ఆంధ్రపదేశ్ ప్రభుత్వంపైనా ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది.