తెలంగాణలో రేపట్నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. కేవలం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే జనం రోడ్లపై తిరిగేందుకు అవకాశం కల్పించనున్నారు. అవీ రోజువారీ నిత్యావసర వస్తువుల కొనుగోళ్ళ కోసం మాత్రమే. మొత్తం 20 గంటల పాటు లాక్ డౌన్ అమల్లో వుంటుంది రోజులో. అసలు తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే అవకాశమే లేదంటూ ఇటీవల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం విదితమే. ప్రజల ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటాయనీ, రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందనీ.. ఇలా పలు రకాల కారణాలు చూపుతూ, లాక్ డౌన్ పట్ల పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేశారు కేసీఆర్. మరోపక్క తెలంగాణలో గత కొద్ది రోజులుగా నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. ప్రస్తుతానికి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అదుపులోనే వుంది. అయితే, టెస్టుల సంఖ్య తగ్గించడంతోనే కేసుల సంఖ్య అదుపులో వున్నట్లు కనిపిస్తోందనీ, వాస్తవానికి గ్రౌండ్ లెవల్ పరిస్థితులు దారుణంగా వున్నాయనే వాదనలు లేకపోలేదు. ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క.. మందులు దొరక్క.. ఆక్సిజన్ సిలెండర్లు దొరక్క ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వున్న ఈటెల రాజేందర్‌ని తొలగించారన్న విమర్శల సంగతి సరే సరి. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ చూసుకుంటున్నారు. తెలంగాణకు హైద్రాబాద్ రూపంలో మెట్రో నగరం వుంది. ఆ మెట్రో నగరంలో ప్రజలు వైద్యం కోసం, మందుల కోసం, ఆక్సిజన్ కోసం నానా తంటాలూ పడాల్సి వస్తోందంటే, అది అత్యంత బాధాకరమైన విషయమే. ఇప్పుడిక లాక్ డౌన్ నేపథ్యంలో పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేం. పరిస్థితులు తీవ్రంగా వున్నప్పుడు లాక్ డౌన్‌కి ససేమిరా అనేసి, పరిస్థితులు అదుపులోకి వచ్చాక లాక్ డౌన్ అడనంలో ఉద్దేశ్యమేంటో మరి.