తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. ఓట్ల లెక్కింపు కోసం హైదరాబాద్, నల్గొండలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజవర్గంలో 93 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 3,57,354 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజక పరిధిలో 71 మంది బరిలో ఉన్నారు. 3,86,320 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రెండు స్థానాల్లో మొత్తం 164 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 7,43,674 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మొత్తం ఎనిమిది హాళ్లలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్‌లో 7 టేబుళ్ల చొప్పున మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పోలైన ఓట్లలో 25 బ్యాలెట్ పత్రాలను ఒక కట్టగా కడతారు.. వీటిని కట్టలుగా కట్టేందుకే ఎక్కువ సమయం పడుతుంది. ఉదయం 8కి ప్రారంభిస్తే రాత్రి 8 వరకు కట్టలు కట్టడానికే సరిపోతుంది. ఆ తర్వాత లెక్కింపు మొదలవుతుంది. రాత్రి 09.30 గంటల సమయంలో తొలి రౌండ్ ఫలితం వెల్లడయ్యే అవకాశముంది.
టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పున మొత్తం 56 టేబుళ్లలో ఏకకాలంలో 56 వేల ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం ఓట్లను లెక్కించడానికి సుమారు 10 గంటల సమయం పట్టే అవకాశముంది. రేపు ఉదయం నాటికి మొదటి ప్రాధాన్యత ఓట్లపై స్పష్టత రావచ్చు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం తేలకుంటే ఎలిమినేషన్ ప్రక్రియ చేపడతారు. తక్కువ ఓట్లు వచ్చిన వారు ఎలిమినేట్ అవుతారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తై ఫలితాలు వచ్చే సరికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకూ కౌంటింగ్ సిబ్బందికి కేంద్రంలోనే వసతులు ఏర్పాటు చేశారు. ఐతే గెలుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు.