వైసీపీ లో కీలక నేతలు జగన్ చెప్పింది పాటించడంలో పెద్దగా ఆసక్తి చూపట్లేదనే వాదనలు బలపడుతున్నాయి. గత ఎన్నికల్లో తాను అనుకున్నట్టుగా నిర్ణయాలు తీసుకుని పార్టీని నడిపించిన జగన్.. ఇప్పుడు అసెంబ్లీ వ్యవహారంలోనూ అదే పద్ధతిలో కొనసాగుతున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోతే సభకు వెళ్లొద్దనే నిర్ణయం ఆయనే తీసుకున్నారు. అయితే, ఈ నిర్ణయంపై చాలా మంది వైసీపీ నేతలు అంతగా సంబందం లేకుండా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బహిరంగంగానే జగన్ స్టైల్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు, పార్టీకి చెందిన మరికొందరు నాయకులు సోషల్ మీడియాలో తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇది మరింత స్పష్టంగా బయటపడింది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీ పోటీ చేయకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నా, అక్కడి నాయకులు మాత్రం పోటీ పెట్టాలని కోరారు. కానీ జగన్ వారి మాటను పట్టించుకోలేదు.
చివరికి ఎన్నికలకు నాలుగు రోజుల ముందు పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ గ్రాడ్యుయేట్లు అందరూ ఆయనకే ఓటు వేయాలని స్పష్టంగా చెప్పిన జగన్.. ఒక్కొక్కరు మరో మూడు ఓట్లు వేయించాలంటూ సూచించారు. అయితే, పోలింగ్ రోజు జరిగిన పరిణామాలు చూస్తే, వైసీపీ గ్రాడ్యుయేట్లు ఎవ్వరూ కూడా బూత్ వద్ద కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే, చాలా మంది కీలక నేతల ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ అయ్యాయట. దీనికి కారణం జగన్ మాటను పట్టించుకోవడం మానేశారా? లేక అంతా మౌనంగా తమ అసంతృప్తిని చూపిస్తున్నారా? అన్న చర్చ వైసీపీ లోనే వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాల్లో ఈ పరిస్థితి ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.


