తెలంగాణ రెవెన్యూ శాఖలో నవశకం ప్రారంభమయింది. ప్రజలకు, రైతులకు సులభంగా, పారదర్శకంగా, స్నేహపూర్వకంగా రెవెన్యూ పనులు జరగాలని… దీర్ఘకాలంగా పేరుకుపోయిన ఎన్నో రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేసింది.
రెవెన్యూ చట్టంలో ఉన్న లొసుగులను రూపుమాపి.. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేసి కొత్త రెవెన్యూ చట్టం బిల్లును సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
కొత్త రెవెన్యూ చట్టం వల్ల భూసంబంధింత సమస్యలన్నీ పరిష్కారం కానున్నాయి. ఇప్పటి నుంచి భూసంబంధిత పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదు. ధరణి వెబ్ సైట్ లో తెలంగాణలోని భూమికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ధరణి వెబ్ సైట్ ను పారదర్శకంగా ఉంచనున్నారు.
అలాగే కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం.. తహసీల్దార్లే జాయిట్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు. ఇక నుంచి తహసీల్దార్లే వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్లు చేస్తారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యవసాయేతర భూములకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.
ఇక్కడ వ్యవసాయేతర భూములు అంటే గ్రామకంఠం, పట్టణ భూములను వ్యవసాయేతర భూములుగా పరిగణించనున్నారు.
ధరణి వెబ్ సైట్ లో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పోరేషన్, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన ఆస్తుల వివరాలు పొందుపరచబడి ఉంటాయి.
ఇక నుంచి క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే వెంటనే పోర్టల్ లో అప్ డేట్ అవ్వడంతో పాటుగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అన్ని రకాల సేవలు ఒకేసమయంలో పూర్తి అవుతాయి.