తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. టీడీపీ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు.. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ధీటైన సమాధానం ఇవ్వగల ఒకే ఒక్కడు.. అంటూ తీన్మార్ మల్లన్న గురించిన చర్చ ఇప్పుడు ఓ రేంజ్‌లో నడుస్తోంది. ఎవరీ తీన్మార్ మల్లన్న అంటే, కథ పెద్దదే వుంది. ఓ యూ ట్యూబ్ ఛానల్.. ఓ టీఆర్ఎస్ వ్యతిరేక ఛానల్.. ఇవే అతని చేతిలో ఆయుధాలు. యూ ట్యూబ్ సంగతి పక్కన పెడితే, ఓ న్యూస్ చానల్‌లో గట్టిగానే సందడి చేస్తుంటాడు సెటైరికల్ షో ద్వారా. ఉత్త సెటైర్లు కాదు, కడిగి పారేస్తుంటాడు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి. ఓసోస్, ఇలాంటోళ్లు చాలామందే వున్నారు కదా.. అన్న డౌట్ మీకు రావొచ్చు.
కానీ, బెదురనేదే అస్సలు కనిపించదు తీన్మార్ మల్లన్నకి. అదే అతని ఆయుధం. తెగించినోడికి.. అతని ఆత్మస్థయిర్యమే ఆయుధం.. అన్నట్టు తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డికి ముచ్చెమట్లు పట్టించేశాడు. వెనకాల ఏ పార్టీ అండదండలూ లేకుండా ఒంటరిగా తీన్మార్ మల్లన్న ఈ స్థాయిలో అధికార పార్టీని వణికించాడంటే, అతనికి ఏదన్నా పార్టీ మద్దతు వుంటే పరిస్థితి ఇంకెలా వుండేదో.! ఈ కారణంగానే ఇప్పుడు తీన్మార్ మల్లన్న వెంట రాజకీయ పార్టీలు చక్కర్లు కొడుతున్నాయి. అతన్ని తమ పార్టీలోకి లాగేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. ‘నేనింకా పూర్తిస్థాయిలో జనంలోకి వెళ్ళలేకపోయానేమో. 10 శాతమే కష్టపడ్డాననిపిస్తోంది..’ అంటూ తృటిలో విజయాన్ని దూరం చేసుకున్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికలపై వ్యాఖ్యానించాడు. గులాబీ పార్టీ గెలిచినా, అంతా ఇప్పుడు తీన్మార్ మల్లన్న గురించే చర్చించుకుంటుండడం గమనార్హం.