భారీ మార్పుల‌తో బ‌రిలోకి.. విజ‌యం సాధించేందుకు తీవ్ర క‌స‌రత్తులు

ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఫేవ‌రేట్‌గా బరిలోకి దిగిన టీమిండియా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు ఏ మాత్రం రాణించ‌డం లేదు. వ‌న్డే సిరీస్‌లో పేల‌వంగా ఆడిన భార‌త్ మూడు టీ 20 సిరీస్‌ల‌లో రెండు మ్యాచ్‌లు అతి క‌ష్టం మీద గెలిచి సిరీస్ ద‌క్కించుకుంది. ఇక టెస్ట్ సిరీస్ విష‌యానికి వ‌స్తే తొలి టెస్ట్‌లోనే ఘోర ప‌రాభవం చెందింది. రెండో ఇన్నింగ్స్‌లో 36 ప‌రుగుల‌కే టీమిండియా కుప్ప‌కూలి పోవ‌డంతో ఇంటా బ‌య‌ట ఆ టీం విమ‌ర్శ‌ల పాలవుతుంది. ఈ నేప‌థ్యంలో డిసెంబరు 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా జ‌ర‌గ‌నున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి పుంజుకోవాల‌ని భావిస్తుంది.

రెండో టెస్ట్ మ్యాచ్ లో భారీ మార్పులు జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఒక‌టి కాదు రెండు కాదు ఐదు మార్పులతో భార‌త్ బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. తొలి టెస్టులో గాయపడ్డ‌ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, పితృత్వ సెలవులు తీసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ త‌ర్వాతి టెస్ట్ మ్యాచ్‌ల‌కు అందుబాటులో ఉండ‌క‌పోవ‌డంతో మేనేజ్‌మెంట్ ఆఖరిగా ఐదు మార్పులు చేసేందుకు స‌న్నాహాలు చేస్తుంద‌ట‌. ఈ క్ర‌మంలో కేఎల్ రాహుల్‌, హైదరాబాద్‌కి చెందిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌‌ , యువ క్రికెటర్ శుభమన్ గిల్‌కీ కూడా అవకాశం దక్కనుందని తెలుస్తుంది. జ‌డేజా, రిష‌బ్ పంత్ కూడా ఈ మ్యాచ్ లో ఆడే ఛాన్స్ ఉంద‌ట‌

తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫ‌ల‌మైన పృథ్వీషా స్థానంలో రాహుల్ ఆడ‌తాడ‌ని తెలుస్తుండగా, కోహ్లీ స్థానంలో శుభ‌మ‌న్ గిల్‌, విహారి స్థానంలో జ‌డేజా, సాహా స్థానంలో రిష‌బ్ పంత్, ష‌మీ స్థానంలో సిరాజ్ రానున్నార‌ని స‌మాచారం. అజింక్యా ర‌హానే కెప్టెన్ బాధ్య‌త‌లు తీసుకోనున్నాడు

రెండో టెస్టుకి భారత్ తుది జట్టు (అంచనా): మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, శుభమన్ గిల్, అజింక్య రహానె (కెప్టెన్) రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్