టీడీపీ నంగనాచితనం.. అప్పుడు చిరంజీవిపై చేసిన దాడి మాటేమిటి.?

టీడీపీ అనుకూల మీడియా, వున్నపళంగా టోన్ మార్చేసింది. మెగా కుటుంబం మీద విపరీతమైన ప్రేమను చాటేసుకుంటోంది. టీడీపీ నేతలూ, పవన్ కళ్యాణ్ మీద వైసీపీ నేతల మాటల్ని ఖండించేస్తున్నారు. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడటమేంటి.? వివాదాల్లోకి మెగా కుటుంబంలోని వ్యక్తుల్ని, మహిళల్నీ లాగడమేంటి.? అంటున్నారు టీడీపీ నేతలు పలు డిబేట్లలో. ఔనా.? ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవి కుటుంబాన్ని అత్యంత హేయంగా దూషించింది అప్పటి టీడీపీ నేతలే కదా. ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేగా వున్న రోజాతో, అప్పుడు టీడీపీ ఎంతలా బండబూతులు తిట్టించిందో అందరికీ గుర్తుంది. ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ‘చిరంజీవి విషయంలో నేను మరీ అంతలా మాట్లాడి వుండకూడదు.. అలా నన్ను రెచ్చగొట్టింది, నన్ను ఉసిగొల్పింది టీడీపీనే..’ అని రోజా కూడా ఓ సందర్భంలో చెప్పుకుని వాపోయారు.

పవన్ కళ్యాణ్ నోరు జారారు, అందుకు ధీటుగా మంత్రి పేర్ని నాని కూడా సమాధానమిచ్చారు. అయితే, మధ్యలో పోసాని కృష్ణమురళి ఎందుకొచ్చారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. నిజానికి, పోసాని.. గతంలో పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన అభిమానంతో వుండేవారు. అంతకు ముందు ఆయన ప్రజారాజ్యం పార్టీలోనూ పనిచేశారు. కొంతకాలం టీడీపీలోనూ వున్నారు. టీడీపీలో పోసాని వున్నప్పటి పరిచయాల్ని వాడుకుని, ఆయన ద్వారా పవన్ కళ్యాణ్‌ని దూషించేలా టీడీపీ చేసిందా.? దానికి వైసీపీ రంగు అంటించారా.? అన్న చర్చ సినీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పోసాని కృష్ణమురళికి మాట మీద నిలకడ వుండదు. రేప్పొద్దున్న పవన్ కళ్యాణ్ దేవుడంటూ, పవన్ కళ్యాణ్ కాళ్ళను ఆయన తన నెత్తిమీద పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.