TDP Vs Janasena : తెలుగుదేశం పార్టీకీ, జనసేన పార్టీకీ మధ్య చిత్ర విచిత్రమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. 2024 ఎన్నికల కోసం ముందుగానే ‘పొత్తుల కూత’ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోకూడదన్నది జనసేనాని ఉవాచ. దానర్థం, విపక్షాలన్నీ ఒక్కతాటిపైటికి రావాలని.
నిజానికి, ఏ రాజకీయ పార్టీకైనా సొంత ఎజెండా అంటూ వుండాలి. అవసరమైతే, ఇతర పార్టీలను కలుపుకుపోవాలి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, ఇతర విపక్షాల్ని కలుపుకోవాలనే ప్రతిపాదన తెస్తే అది వేరే వ్యవహారం. జనసేనాని ఎందుకు తొందరపడినట్టు.?
పైగా, బీజేపీ అలాగే జనసేన మధ్య పొత్తు నడుస్తోంది. ఇలాంటప్పుడు ట్రయాంగిల లవ్ స్టోరీ అవసరమా.? ‘దమ్ముంటే 150 సీట్లలో పోటీ చేసి అప్పుడు మాట్లాడాలి..’ అంటూ జనసేనను వైసీపీ టార్గెట్ చేసింది. ఇదొక రాజకీయ వ్యూహం. నిజానికి, వైసీపీకి జనసేన ప్రధాన రాజకీయ శతృవు కాదు. కానీ, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సూత్రాన్ని వైసీపీ వాడుతోంది.
సరే, జనసేన విషయంలో వైసీపీ అత్యుత్సాహం.. ఆ పార్టీ కొంప ముంచుతుందా.? అన్నది వేరే చర్చ. ‘వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోనివ్వను..’ అని చెప్పి రోజులు గడుస్తున్నా, జనసేనానికి తెలుగుదేశం పార్టీ అధినేతనుంచి ఆశించిన స్పందన వచ్చినట్టు లేదు.
వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ ‘బిచ్చం నాయక్’ అని పవన్ మీద వేస్తున్న సెటైర్లతో అయినా, జనసేన పార్టీ ‘మేం టీడీపీతో పొత్తు పెట్టకోం..’ అని చెప్పలేకపోతుండడం ఆశ్చర్యకరం. టీడీపీ తగ్గేది లేదంటోంది.. ఆ టీడీపీని జనసేన వదిలేది లేదంటోంది. ఇదండీ రాజకీయం.