ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ అంటే టీడీపీకి కొమ్ముకాసే పార్టీగా, టీడీపీ తోక పార్టీగా ముద్ర పడింది. గతంలో బీజేపీ లో ఎక్కువ మంది చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మాట్లాడే వర్గం ఉండేది. టీడీపీ పార్టీ మీద చంద్రబాబు మీద ఈగ వాలకుండా కాషాయ కండువా అడ్డు కప్పేవాళ్లు, ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ఏపీలో బీజేపీ ఎన్నటికీ ప్రధాన పార్టీగా ఎదగటం కష్టమని భావించిన అగ్ర నాయకత్వం పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించి అందులో భాగంగా, టీడీపీ అంటే ఒంటికాలిపై లేచే సోము వీర్రాజు ను పార్టీ అధ్యక్షుడిగా నియమించింది.
దీనితో బీజేపీ పార్టీలో టీడీపీ పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్ళ నోటికి క్రమంగా తాళం పడింది. ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వెంటనే వాళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం లేదా..? పార్టీ నుండి బయటకు పంపటం జరుగుతుంది. తాజాగా బీజేపీ స్పోక్ పర్సన్ లంక దినకర్ ను పార్టీ నుండి బహిష్కరించాలని సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అమరావతి విషయంలో బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ అభిప్రాయాన్ని బలపరుస్తూ లంక దినకర్ వ్యాఖ్యలు చేయటం దీనికి కారణమని తెలుస్తుంది.
నిజానికి లంక దినకర్ మొదట టీడీపీ కి చెందిన నేత అక్కడ కూడా పార్టీ తరుపున వాయిస్ గట్టిగా వినిపించేవాడు. 2019 లో టీడీపీ పార్టీ ఓడిపోవటంతో పార్టీకి రాజీనామా చేసి, ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డా సమక్ష్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. అయితే బీజేపీ లో ఉన్నకాని టీడీపీ వాసన ఇంకా పోకపోవటం, అదే సమయంలో సీఎం జగన్ మీద విమర్శలు చేయటంతో లంక దినకర్ కు బీజేపీ పార్టీ ఎగ్జిట్ డోర్ చూపించింది. దీనిని బట్టి చూస్తే బాబుకు సపోర్ట్ గా ఎవరు మాట్లాడిన కానీ, అదే సమయంలో జగన్ ను విమర్శించినా కానీ వాళ్ళకి ఇదే విధంగా జరుగుతుందని సృష్టమైన హెచ్చరికలు పార్టీ నేతలకు ఇచ్చినట్లు అనిపిస్తుంది.