గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి కదా..? మళ్ళీ గ్రేటర్ ఎన్నికలు ఏంటి, వైసీపీ టీడీపీ పోటీ ఏంటని అనుకుంటున్నారా..? గ్రేటర్ ఎన్నికలు అంటే హైదరాబాద్ ఎన్నికలు కాదు, గ్రేటర్ విశాఖ ఎన్నికలు. వచ్చే ఏడాదిలో ఖచ్చితంగా విశాఖ మున్సిపాలిటీ ఎన్నికలు జరగటం ఖాయం, దీనితో విశాఖ మేయర్ పీఠం దక్కించుకోవాలని వైసీపీ మరియు టీడీపీ పావులు కదుపుతున్నాయి.
బలాబలాలు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా కనిపిస్తూన్న కానీ, విశాఖలో మాత్రం టీడీపీ హవా కనిపిస్తుంది. విశాఖలోని నాలుగు ఎమ్మెల్యే సీట్లను గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. దాంతో, ఎమ్మెల్యేల తీరు ఎలా ఉన్నా క్షేత్ర స్ధాయిలో పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నారని టీడీపీ గట్టిగా నమ్ముతోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వైసీపీ లోకి వెళ్ళటం టీడీపీ కి గట్టి దెబ్బ అనే చెప్పాలి. అదే సమయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంట శ్రీనివాస్ టీడీపీకి దూరంగా ఉంటున్నాడు ఆది కూడా పార్టీకి నష్టం కలిగించే అంశం.
తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు బలమైన నాయకుడు. విశాఖ పశ్చిమంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబుకు బలం ఉంది. వైసీపీ తరుపున ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ దూకుడు చూపిస్తున్నాడు. దీనితో ఇక్కడ పోటాపోటీగానే వాతావరణం ఉంటుందని అంటున్నారు. గాజువాకలో చూసుకుంటే అక్కడ టీడీపీ అధ్యక్షుడు ఉన్న నియోజకవర్గం.
మరో పక్క వాసుపల్లి గణేష్ వైసీపీ లోకి రావటంతో ఆ పార్టీకి విశాఖలో పట్టు పెరిగిన మాట వాస్తవము, ఇక ఉత్తర విశాఖ లో వైసీపీ ఇంచార్జి కెకె రాజు అసలైన ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు. అక్కడా గంట శ్రీనివాస్ సైలెంట్ గా ఉండటం వైసీపీకి అనుకూలం. విశాఖలో యాదవ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. దీనితో విశాఖ పార్లమెంట్ అధ్యక్షునిగా వంశీకృష్ణను పార్టీ నియమించింది వైసీపీ. ఒక రకంగా అనధికారికంగా ఆయనే మేయర్ అభ్యర్థి అన్నట్లు ప్రచారం జరుగుతుంది.
మరోపక్క టీడీపీ కూడా ఇదే సూత్రాన్ని అవలంభిస్తుంది. ఆ పార్టీ కూడా యాదవ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ను విశాఖ పార్లమెంట్ అధ్యక్షునిగా నియమించింది. మేయర్ అభ్యర్థిగా ఆయన్నే ఖరారు చేసే అవకాశం ఉంది దాంతో ఇపుడు సామాజికవర్గ సమీకరణలపరంగా చూసుకున్నా వైసీపీ టీడీపీల మధ్య గట్టి పోటీ నెలకొందని చెప్పాలి. ఇలా అన్ని విధాలుగా చూసుకుంటే విశాఖ మేయర్ ఎన్నికల్లో గట్టి పోటీ తప్పదని తెలుస్తుంది.