AP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది . ఈ ఏడాది పాలనపై ఎన్నో సర్వే సంస్థలు పలు సర్వేలను బయట పెట్టారు. ఇక తెలుగుదేశం పార్టీకి కుడి భుజంగా పని చేస్తున్నటువంటి వార్తాపత్రికలలో ఈనాడు ఒకటి అలాగే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఒకటి. ఈ రెండు వార్తాపత్రికలు చంద్రబాబు నాయుడు గురించి కలలో కూడా వ్యతిరేకంగా మాట్లాడరనే సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏబీఎన్ రాధాకృష్ణ ఏడాది పాలన గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాటు పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాధాకృష్ణ తనదైన మార్క్ విశ్లేషణ చేశారు. అవినీతి, అక్రమాలు, ఇసుక కుంభకోణాలు, స్మార్ట్ మీటర్ల వ్యవహారాలు, భూ దందాలు.. ఇలా ప్రతి అంశం మీద వేమూరి రాధాకృష్ణ తన చానల్ లో ప్రస్తావించారు. ఒకరకంగా చెప్పాలంటే కూటమి ఏడాది పాలనలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పకనే చెప్పేస్తారు.
గత ప్రభుత్వ హయామంలో పెద్ద ఎత్తున భూదందాలు జరిగాయి, అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి.స్మార్ట్ మీటర్లతో అడ్డగోలుగా వ్యవహరించారని.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అనేక కథనాలను ప్రసారం చేసింది. అయితే కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయని తాజాగా రాధాకృష్ణ తన విశ్లేషణలో తెలియచేశారు. ఇలా కూటమి ప్రభుత్వం గురించి రాధాకృష్ణ వ్యతిరేకంగా మాట్లాడటంతో ఇదే అదనంగా భావించడం వైసీపీ సోషల్ మీడియా ఈ కథనాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. “బాబు” కు మౌత్ పీస్ లాంటి ఛానల్లో ఇలాంటి కథనాలు వస్తున్నాయంటే.. ఏపీలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని వైసిపి సోషల్ మీడియా విభాగం వ్యాఖ్యానిస్తోంది. మరి దీనిపై టిడిపి శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.