ఆప్ఘనిస్తాన్‌కీ, ఆంధ్రప్రదేశ్‌కీ లింకేంటి.? డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు టీడీపీ టార్గెట్ చేస్తుంది.? సున్నితమైన అంశాన్ని పట్టుకుని రాద్ధాంతమెలా చేయాలో తెలుగుదేశం పార్టీకి తెలిసినంతగా ఇంకే ఇతర పార్టీకీ తెలియదనడానికి తాజా డ్రగ్స్ వ్యవహారమే కారణం. చంద్రబాబు సహా, టీడీపీ నేతలంతా, వైసీపీ ప్రభుత్వంపై డ్రగ్స్ ఆరోపణలు చేయడాన్ని చూస్తున్నాం.
ప్రభుత్వం పట్ల ప్రజల్లో వున్న, వుండాల్సిన విశ్వాసాన్నీ, గౌరవాన్నీ చెడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నానా రకాల ఆరోపణలూ చేస్తోందన్నది నిర్వివాదాంశం. కాకినాడ పోర్టులో ఓ షిప్ తగలబడిందట.. దాంట్లో డ్రగ్స్ వున్నాయట.. దీనంతటి వెనుక వైసీపీ ఎమ్మెల్యే, మరికొందరు వైసీపీ ముఖ్య నేతల హస్తం వుందట.. ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయట.. ఇదీ టీడీపీ ఆరోపణ.
ఇలాంటి విషయాల్లో ప్రతిసారీ అత్యుత్సాహం చూపే టీడీపీ నేత పట్టాభి, షరామామూలుగానే పబ్లిసిటీ స్టంట్లు మొదలెట్టారు. వ్యవహారం వైసీపీ – టీడీపీ మధ్య ఘర్షణ దాకా వెళ్ళింది. ప్రస్తుతం కేసుల ట్రెండ్ నడుస్తోంది. టీడీపీ నేతల మీద కేసులు నమోదవుతున్నాయి.
అసలు విషయమేంటి.? అందులో వివాదమెంత.? అందులో వాస్తవమెంత.? అన్నదానిపై టీడీపీకి అస్సలేమాత్రం అవగాహన వుండదు. ప్రతి విషయాన్నీ వివాదం చేయడం టీడీపీకి అలవాటే. కేసులు నమోదై, అరెస్టుల జరిగితే అదో లొల్లి. రాజకీయాలకతీతంగా డ్రగ్స్ వ్యవహారంపై మాట్లాడాల్సి వుంటుంది. కానీ, దురదృష్టం.. టీడీపీ లాంటి పార్టీ, ప్రతిపక్షంగా వుంటే.. రాష్ట్రంలో రాజకీయాలు ఇలాగే తగలడతాయి.
ఏపీలోని అధికార పార్టీ నేతలకు డ్రగ్స్ వ్యవహారాలతో లింకులుంటే, సంబంధిత కేంద్ర శాఖలు.. చూస్తూ ఊరుకుంటాయా.? అన్న ఇంగితం టీడీపీకి లేకపోవడం శోచనీయం.