తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని మహానాడు పేరుతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం విదితమే. అయితే, ఒకప్పటి మహానాడుకీ, ఇటీవలి కాలంలో జరుగుతున్న మహానాడుకీ చాలా తేడా. మహానాడులో ఆత్మ పరిశీలన అనేది వుండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. సొంత డబ్బా, ఇతరుల మీద విమర్శలకే పరిమితమవుతోంది మహానాడు. చంద్రబాబు భజన తప్ప మహానాడులో కొత్తగా ఏమీ కనిపించడంలేదు. తెలుగుదేశం పార్టీని ఎలా బలోపేతం చేయాలి.? అన్న విషయమై ఆలోచన చేయడం ఎప్పుడో చంద్రబాబు మర్చిపోయారు. కరోనా నేపథ్యంలో వర్చువల్ విధానంలో మహానాడు జరుగుతున్న దరిమిలా, ఈసారి మహానాడు గురించి టీడీపీ శ్రేణుల్లోనూ పెద్దగా ఆసక్తి లేదు. అధికార వైసీపీ మీద విమర్శలు, తమ హయాంలో జరిగిన గొప్పల గురించి చంద్రబాబు భజన షురూ చేశారు.
ఇటీవలి కాలంలో మరణించిన టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలకు సంతాపం తెలపడం అనేది షరామామూలు వ్యవహారమే. నిత్యం జూమ్ ద్వారా చంద్రబాబు చేస్తున్న విమర్శలకు అదనంగా మహానాడులో ఏమన్నా ఆయన మాట్లాడుతున్నారా.? అంటే, అలాంటిదేమీ లేదు. నిజానికి, చంద్రబాబు మాట్లాడాలనుకుంటే, పార్టీ బాగు కోసం చాలా చాలా మాట్లాడాలి. తెలంగాణలో టీడీపీ ఎందుకు నాశనమైపోయింది.? ఆంధ్రపదేశ్‌లో టీడీపీకి ఎందుకు ఆ దుస్థితి వచ్చింది.? లాంటి అంశాలన్నిటిపైనా చర్చ జరగాలి. లోకేష్ నాయకత్వంపై పార్టీలో వస్తున్న విమర్శల గురించి కూడా మహానాడు వేదికగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది. కానీ, ఇవేవీ జరగవు. షరామామూలుగానే చంద్రబాబు ఇంకోసారి పార్టీ అధినేతగా ఎంపికవుతారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తారు.. ఇదీ మహానాడులో జరిగే పరమ రొటీన్ తంతు. ఇదే, తెలుగుదేశం పార్టీకి ఎదుగూబొదుగూ లేకుండా చేస్తోంది. ఈమాత్రందానికి మహానాడు నిర్వహణ దేనికి.? ఏమో, చంద్రబాబే పునరాలోచించుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకోలేని రాజకీయం శుద్ధ దండగ.. అని చంద్రబాబుకి ఎప్పుడు అర్థమవుతుందో.? పరనింద, ఆత్మస్తుతి పక్కన పెడితే తప్ప, టీడీపీకి రాజకీయ భవిష్యత్తు వుండదుగాక వుండదు.