టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ స్వస్థలం కృష్ణా జిల్లా. దీంతో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని ఆదరించారు ఆజిల్లా వాసులు. ఎన్నో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అపూర్వ విజయాన్ని కట్టబెట్టింది కృష్ణా జిల్లా. స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు అన్నింటిలో టీడీపీకే పట్టంకడుతూ వచ్చారు జిల్లా వాసులు. పలు సందర్భాల్లో టీడీపీ పరాజయం చెందిన క్యాడర్ మాత్రం దూరం కాలేదు. తెలుగు తమ్ముళ్లు టీడీపీ జెండాలు వీడలేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉంటే కిందటి ఎన్నికల్లో కేవలం రెండు స్థానాల్లో మాత్రమే టీడీపీని గెలిపించారు ఇక్కడి ప్రజలు. ఒక ఎంపీ స్థానాన్ని గెలిపించారు.
ఇక గన్నవరం నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ అధికార పార్టీ మద్దతుదారుడిగా మారిపోయారు. అధికారికంగా వైసీపీలో చేరితే శాసనసభ సభ్యత్వం రద్దు అవుతందన్న కారణంగా అనధికారికంగా వైసీపీ నేతగా కొనసాగుతున్నారు. గతంలో కలిసి మెలిసి ఉన్న టీడీపీ నేతలంతా ఇప్పుడు గ్రూపుల వారీగా విడిపోయారు. ఈకారణంగా విజయవాడ పార్లమెంటు, బందరు పార్లమెంట్ నియోజకవర్గాలకు వేర్వేరుగా కమిటీలను వేయాల్సి వచ్చింది. విజయవాడ సిటీలో గద్దె రామ్మోహన్ గతంతో పోల్చితే చాలా నిరుత్సాహంగా ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఒక్కరు మాత్రమే పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎంపీ కేశినేని ఈపాటికే అసమ్మతి సెగలు రాజేశారు. పార్టీతో సంబంధం లేకుండా తనకు తోచినట్లు వ్యవహరిస్తున్నారు. వర్ల రామయ్య పార్టీ కేంద్ర కార్యాలయానికి పరిమితం అయ్యారు. టీడీపీని వీడి వైసీపీలో చేరిన కొడాలి నాని టీడీపీని టార్గెట్ చేస్తూ బండ బూతులు తిడుతున్నా…జిల్లాకు చెందిన టీడీపీ నేతలు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
తెలుగు తమ్ముళ్లు ఎంతసేపు రాష్ట్ర స్థాయి అంశాలను ప్రస్తావిస్తూన్నారనే కాని జిల్లా అంశాలపై పెదవి విప్పడం లేదు. మాట్లాడితే ఎక్కడ ఎవరి నుంచి ఏరకమైన ఇబ్బందులు వస్తాయో అన్న ఫీలింగ్ తో చాలా జాగ్రత్తగా ఉంటున్నారంట. స్థానిక వైసీపీ నేతల అక్రమాల అంశాన్ని అయితే ఏనాడో మర్చిపోయారంట. జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే కేవలం ఐదు నియోజకవర్గాల్లోనే టీడీపీ నేతలు యాక్టివ్ గా ఉన్నారని చంద్రబాబు గుర్తించారు. అయినా ఎవర్ని మందలించే పరిస్థితి లేకపోవడంతో ఆయనే మిన్నకుండిపోయారంట.
నూజివీడు, కైకలూరు, పెడన అవనిగడ్డ, గన్నవరం, విజయవాడ పశ్చిమ, పామర్రు, తిరువూరు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని తెలుగు తమ్ముళ్లే చెబుతున్నారు. జిల్లా స్థాయిలో అధికార పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను టార్గెట్ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో రాణించలేమని చంద్రబాబు చెబుతున్నా….అంత కసిగా పనిచేసేంత శక్తి స్థానిక టీడీపీ నేతల్లో కొరవడిందంట.