టీడీపీ – జనసేన పొత్తు దాదాపు ఖాయమైపోయినట్లే కనిపిస్తోంది.

TDP Leaders : కష్ట కాలంలోనూ తెలుగుదేశం పార్టీతోనే వున్నాం.. పొత్తుల పేరుతో టిక్కెట్ల విషయంలో అన్యాయం చేస్తే ఎలా.? అంటూ తెలుగు తమ్ముళ్ళు అప్పుడే గుస్సా అవుతున్నారట. ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నట్టు, ఇంకా జనసేనతో పొత్తు ఖరారవలేదుగానీ, టీడీపీ నేతల్లో అప్పుడే గందరగోళం షురూ అయ్యింది.

ప్రధానంగా ఉత్తరాంధ్రలోని ఓ నాలుగు నియోజకవర్గాల్లోనూ, ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని స్థానాల్లోనూ టీడీపీ నేతలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఏంటి పరిస్థితి.? అన్నదానిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ఖచ్చితమైన అవగాహన వుంది. ఆ పార్టీ నేతల సంగతి సరే సరి. ఏయే ప్రాంతాల్లో జనసేన బలంగా వుందన్నదానిపై టీడీపీ గతంలోనే అంతర్గత సర్వేలు చేయించుకుంది.

సర్వేలంటే అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితిని అంచనా వేయడమే కదా.! ఆ నివేదికలన్నీ టీడీపీ నేతలకు అందుబాటులోనే వున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన, ఫాలానా మొత్తంలో సీట్లు ఆశించవచ్చన్న లెక్క టీడీపీ నేతల దగ్గర వుంది. దాంతో, ఆయా నియోజకవర్గాల్లో త్యాగం చేయాల్సిన టీడీపీ నేతలు, అధినేత మీద పొత్తు విషయమై ఒత్తిడి తెస్తున్నారట. పొత్తు పెట్టుకున్నా, తమకు ఇబ్బంది వుండకూడదని కోరుకుంటున్నారట.

అయితే, జనసేన మాత్రం ఈ విషయమై లైట్ తీసుకుంటోంది. ‘ఎవరెవరు కలిసొస్తారో చూద్దాం..’ అంటూ జనసేనాని ‘తేలిక’ వ్యాఖ్యలు చేయడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘గతంలో మన కోసం పని చేశారు.. ఇప్పుడు ఆ పార్టీకోసం త్యాగం చేయాల్సి వస్తే తప్పదు కదా..’ అని అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్ళలో గుబులు రేపుతున్నాయట.

చూస్తోంటే, టీడీపీ – జనసేన పొత్తు దాదాపు ఖాయమైపోయినట్లే కనిపిస్తోంది.