ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీ పార్టీని బతికించడం కోసం.. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించడం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు మామూలుగా లేవు. ఆయన చేసే ప్రయత్నాలు చివరకు ఎంత దూరం వెళ్తున్నాయంటే.. అవి పార్టీకే నష్టం కలిగించేలా ఉన్నాయి.
మరి పార్టీ బతకాలంటే ఆమాత్రం కష్టపడాలి కదా.. టీడీపీ నేతల్లో ధైర్యం నూరిపోయాలి కదా.. శ్రేణుల్లో ఉత్సాహం నింపాలి కదా.. అందుకోసం చంద్రబాబు పడని పాట్లు లేవు. అందుకే.. అధికార పార్టీని ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు చంద్రబాబు. ఏదో ఒకటి అంటూ వార్తల్లో నిలుస్తూ.. టీడీపీ అధికారంలో ఉంటే ఇలా చేసేది.. అలా చేసేది.. వైసీపీ పార్టీ ఏపీని నాశనం చేస్తోంది.. అంటూ ఏవేవో చెబుతూనే ఉన్నారు. ప్రతిపక్ష నేత అంటేనే అధికార పార్టీని విమర్శిస్తారు. అందులో వింతేమీ లేదు. కాకపోతే.. ఎంత మేరకు విమర్శించాలో అంతమేరకే విమర్శించాలి కానీ.. అది హద్దులు దాటుతోంది.. అనేదే టీడీపీ శ్రేణుల ఆందోళన.
ఏదైనా శృతి మించితే ఏమౌతుంది.. ఉన్నది కాస్త చేజారుతుంది. కరోనా వల్ల చంద్రబాబు లాక్ డౌన్ సమయం నుంచి ఇప్పటి వరకు పార్టీ కార్యకర్తలతో కానీ.. నాయకులతో కానీ.. జూమ్ ద్వారానే మీటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు ఏదో ఒక కారణం చెప్పి జూమ్ మీటింగులు పెట్టి.. టీడీపీ శ్రేణుల బుర్ర తింటున్నారట చంద్రబాబు.
అలా చేయాలి.. ఇలా చేయాలి… వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఇలా చేయాలి.. అంటూ తెగ ఉపన్యాసాలు ఇస్తున్నారట. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది చేశా.. ఇది చేశా.. అలా చేశా.. ఇలా చేశా.. అంటూ తనకు తాను గొప్పలు చెప్పుకుంటూ.. టీడీపీ నేతల బుర్రను మాత్రం తెగ తినేస్తున్నారట చంద్రబాబు.
జగన్ అయితే.. ఏ మీటింగ్ పెట్టినా.. ఏమాత్రం హడావుడి లేకుండా.. సొల్లు లేకుండా.. సూటిగా చెప్పేస్తారు. ఇలా ప్రతిరోజు మీటింగులు అంటూ హడావుడి చేయరు.. కానీ.. చంద్రబాబు మాత్రం తమను ఇలా విసిగిస్తున్నారేంటి.. అంటూ టీడీపీ శ్రేణులు తమలో తామే తెగ బాధపడిపోతున్నారట.