గెలిచింది వైసీపీనే.. కానీ పెత్తనం టీడీపీది ??

ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఆ పార్టీ తరపున ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తమకు కూడ ఎమ్మెల్యేలకున్న పవర్ ఉందన్నట్టు ప్రవర్తిస్తుంటారు.  ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లెక్కచేయరు.  ఎందుకంటే ప్రభుత్వం, పవర్ వారిది కాబట్టి.  కొన్ని సందర్భాల్లో అధికార పార్టీ సైతం నియోజకవర్గాల్లో ఉన్న అపోజిషన్ ఎమ్మెల్యేల కంటే తమ తరపున ఓడిపోయిన వ్యక్తులకే ప్రాధాన్యం ఇస్తుంటుంది.  అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ ఈ తరహా రాజకీయం చేయకుండా ఉండవు.  కానీ వైసీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.  చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దూసుకుపోతుంటే కొన్ని స్థానాల్లో మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ నేతల దూకుడు ముందు తేలిపోతున్నారట. 

TDP leaders domination on YSRCP MLA's
TDP leaders domination on YSRCP MLA’s

టీడీపీ నుండి గత ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో చాలామంది సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంచి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే.  వైఎస్ జగన్ హవాను తట్టుకోలేక వీరిలో చాలామంది ఓడిపోతే అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వఛ్చి అనూహ్యంగా టికెట్ పొంది జగన్ బొమ్మతో గెలిచిన వైసీపీ అభ్యర్థులు  చాలామంది ఉన్నారు.  వీళ్ళలో కొందరు బాగానే రాణిస్తున్నా ఇంకొందరు మాత్రం నోట్లో నాలుక లేక ప్రతిపక్షం ముందు వెలవెలబోతున్నారు.  గత ప్రభుత్వం తమదే కాబట్టి టీడీపీ లీడర్లు మంచి నెట్ వర్క్ నిర్మించుకోగలిగారు.  అధికారాలతో  సత్సంబంధాలను పెంచుకున్నారు.

TDP leaders domination on YSRCP MLA's
TDP leaders domination on YSRCP MLA’s

అసలు జగన్ లేకుంటే తామే గెలిచేవారమని చెప్పే వీళ్లంతా పదవి లేకపోతేనేం లోకల్ పవర్ ఉందిగా అంటూ వైసీపీ ఎమ్మెల్యేల మెతక వైఖరిని అలుసుగా తీసుకుని చెలరేగిపోతున్నారు.  అసలు ఎమ్మెల్యేతో పని లేకుండా అన్నీ తామే చక్కబెట్టేస్తున్నారు.  కరోనా లాక్ డౌన్ కారణంగా అభివృద్ధి పనులేవీ సాగకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలకు జనంలో తిరిగే అవకాశం లేకుండా పోయింది.  ఇవన్నీ టీడీపీ మాజీలకు కలిసొచ్చాయి.  ప్రజల్లో తిరుగుతూ వారికేం కావాలో తెలుసుకుని తమ పలుకుబడి ఉపయోగించి పనులు చేసి పెట్టేస్తున్నారట.  దీంతో జనానికి సైతం వైసీపీ ఎమ్మెల్యేలను సంప్రదించే అవసరం రావట్లేదు.  ఫలితంగా ఆయా నియోజకవర్గాల్లో పవర్ వైసీపీదే అయినా పెత్తనం టీడీపీదే అన్నట్టు ఉందట పరిస్థితి.