చంద్రబాబుకు బెదిరింపులు.. ఇదంతా వారిపనేనా.. ?

మనిషికి ఊపిరి అందకుంటే బ్రతకడం ఎంత కష్టమో, రాజకీయనాయకులకు పదవి లేకుంటే కూడా అంతే కష్టం.. వారికి ప‌ద‌వులే ప్రామాణికం.. ప్రాణం కూడా.. ఒకవేళ పదవి దూరమైందనుకోండి వారి ప్రాణం పోయిన‌ంతగా విలవిలలాడిపోతారు.. ప్రస్తుతం ఏపీలోని టీడీపీ పరిస్దితి ఇలాగే ఉందట.. ఒకరకంగా ఆక్సిజన్ అందకుంటే రోగి ఎలా అల్లాడిపోతాడో టీడీపీ పరిస్దితి కూడా ఇలాగే మారిందట.. ఇప్పటికే చక్కర కోసం చీమలు దారికట్టినట్టుగా, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో సగానికి సగం వైసీపీలోకి వెళ్లిపోయారు.. ఇక టీడీపీలో మిగిలిన వారు అతికొద్ది మంది.. ఇలాంటి పరిస్దితుల్లో వారి నుండి కూడా చంద్రబాబుకు తలనొప్పులు వస్తున్నాయట.. అది మామూలు నొప్పి కాదండి.. ఏకంగా బెదిరింపేనటా..

ఆ వివరాలు చూస్తే టీడీపీలోని ప‌లువురు నేత‌లు పార్టీ అధినేత చంద్రబాబును బ్లాక్‌మెయిల్ చేస్తున్నార‌న్న చ‌ర్చ చంద్రబాబు సొంత పార్టీలోనే న‌డుస్తోంది. అస‌లే పార్టీ క‌ష్టాల్లో ఉంది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని న‌డిపించే నాథుడు లేక టీడీపీ అనాధగా మారింది.. ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లో బాబు ఏ నిర్ణయం తీసుకున్నా కొంద‌రికి ఖేధం మ‌రి కొంద‌రికి మోదం అన్నట్టుగా ప‌రిస్థితి మారిందట.. ఇకపోతే ఇటీవ‌ల పార్టీలో కొత్త అధ్యక్షుడి నియామ‌కానికి చంద్రబాబు పావులు క‌దుపుతున్నార‌నే ప్రచారం ఊపందుకున్నదన్న విషయం తెలిసిందే.. అయితే పార్టీ ప‌గ్గాల‌ను అదే జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడికి ఇవ్వాల‌ని చంద్రబాబు నిర్ణయించార‌నే వార్తలు తెర‌మీదికి వ‌చ్చాయి..

కాగా క‌ళా వెంక‌ట్రావు మాత్రం ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తూ ఇప్పుడు న‌న్ను తొల‌గించాల్సిన అవ‌స‌రం లేదు. అదే జ‌రిగితే.. నా దారి నేను చూసుకుంటా అని ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో అన్నార‌ట‌. అదీగాక అచ్చెన్నాయుడు కూడా త‌న‌కు ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే ఈ ప‌ద‌వి స్వీక‌రిస్తాన‌ని.. పదవి ఇచ్చినట్లే ఇచ్చి త‌న‌పై పెత్తనం చేసేలా అయితే ఆ పదవి తనకు వ‌ద్దని ఖ‌రాఖండీగా చెప్పేశార‌ట‌. దీనిని బ‌ట్టి అచ్చెన్నకు చంద్రబాబు ప‌ద‌వి ఇచ్చినా ఆయ‌న డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమ‌వుతోంది.

వీరే కాకుండా గుంటూరు జిల్లాలో రాయ‌పాటి ఫ్యామిలీ త‌మ‌కు స‌త్తెన‌ప‌ల్లి సీటు కావాలని డిమాండ్ చేయడంతో పాటుగా, ప‌లువురు సీనియ‌ర్లు సైతం త‌మ కండీష‌న్లకు చంద్రబాబు ఒప్పుకుంటారా.. లేదా త‌మ‌దారి తాము చూసుకోమంటారా అని బెదిరిస్తున్నట్టు టాక్‌. ఇలాంటి బెదిరింపులు చంద్రబాబుకు ప‌లువురు నేత‌ల నుంచి ఎదురవుతున్నాయని సాక్షాత్తూ టీడీపీ నేత‌లే చెవులు కొరుక్కుంటున్నారట. మరి ఇలాంటి క్లిష్ట పరిస్దితుల్లో పార్టీని కాపాడుకోవడానికి బాబు పెద్ద సాహసమే చేయవలసిన పరిస్దితి ఏపీలో నెలకొందట..